సంపూర్ణ హక్కుతో సంతోషం

16 Feb, 2022 03:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్ధిదారుల ఆనందోత్సాహాలు

అధికారంలో ఉన్నప్పుడు ఓటీఎస్‌ కింద వడ్డీ రాయితీకి చంద్రబాబు ససేమిరా

నాడు ఆయన పట్టించుకోకపోగా.. నేడు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పిస్తుంటే టీడీపీ దుష్ప్రచారం

స్వచ్ఛందంగా ఓటీఎస్‌ వినియోగించుకుంటున్నాం: లబ్ధిదారులు

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ముందు కొచ్చిన వారు 9.69 లక్షల మంది

ఫొటోలో కనిపిస్తున్న కంచెర్ల కృష్ణవేణిది తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం. చాలా ఏళ్ల క్రితం గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. రుణం చెల్లించకపోవడంతో ఇంటి పత్రాలు తనఖాలోనే ఉండిపోయాయి. గత ఏడాది సీఎం జగన్‌ ప్రభుత్వం ఇంటి రుణాలపై రాయితీ ఇస్తూ, నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. దీంతో తన అప్పు వడ్డీ, అసలు కలిపి రూ. 50,620కు చేరిందని తెలుసుకుంది. అయితే, రూ.10 వేలు చెల్లిస్తే చాలని అధికారులు సూచించడంతో.. ఆ మొత్తాన్ని చెల్లించింది. సర్కారు సర్వహక్కులతో ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉంది.

ఈ ఫొటోలో కనిపిస్తున్న జి. వాణిప్రియది శ్రీకాకుళం జిల్లా రాజాం. రోజూ కూలి పనికి వెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. ఈమెకు భర్త కూడా లేడు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. ఆ ఇంటికి హక్కు పత్రాలు లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రుణం కోసం బ్యాంకుకు వెళ్తే అప్పు కూడా పుట్టదు. 
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టడంతో వాణిప్రియ రూ.10వేలు కట్టేసి ఇంటిపై సంపూర్ణ హక్కులు పొందింది. దీంతో ఆ ఆస్తి విలువ ఇప్పుడు రూ.10 లక్షలకు పెరిగిందని ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తోంది. భవిష్యత్తులో బ్యాంకు రుణం వస్తుందని  ధీమాగా ఉంది. 
.. ఇలా కృష్ణవేణి, వాణిప్రియ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది పేదలు ఈ పథకం కింద ఇళ్లపై సర్వహక్కులు పొందుతున్నారు.

సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ (జేఎస్‌జీహెచ్‌పీ) కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మంది ఇళ్లు నిర్మించుకోగా వీరిలో 96% మందికి ఇళ్లలో నివసించే హక్కులు తప్ప, ఆస్తులపై ఇతర హక్కులు లేవు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు వరంలా మారింది. ఎంతో సంతోషంతో వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, టీడీపీ, దాని అనుకూల పచ్చమీడియా ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నాయి.

ఈ పథకంపై ఎక్కడలేని దుష్ప్రచారం చేస్తున్నాయి. నిజానికి.. 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వాలు ఓటీఎస్‌ను అమలుచేస్తూ వస్తున్నప్పటికీ 2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఓటీఎస్‌ అమలుచేయాలని ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గృహ నిర్మాణ సంస్థ పాలకవర్గం కోరినా చంద్రబాబు కనికరించలేదు. జగన్‌ సీఎం అయ్యాక జేఎస్‌జీహెచ్‌పీ ప్రవేశపెట్టడంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,69,786 మంది ముందుకొచ్చారు. వీరిలో 3,69,139 మంది పేర్లపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

రూ.16 వేల కోట్ల మేర లబ్ధి
1983 నుంచి 2011 మధ్య గృహ నిర్మాణ సంస్థకు ఇళ్ల లబ్ధిదారులు పడిన బకాయి వడ్డీతో కలిపి రూ.14,400 కోట్లుగా ఉంది. ప్రస్తుతం జేఎస్‌జీహెచ్‌పీ ద్వారా ఓటీఎస్‌ రూపంలో ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మాఫీ చేసింది. అంతేకాక.. రిజిస్ట్రేషన్‌ సమయంలో చార్జీలు, ఫీజులను ఎత్తివేస్తూ రూ.6 వేల కోట్లు పేదలపై భారం పడకుండా చూసింది. ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర పేదలకు లబ్ధిచేకూర్చింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఇంటిపై ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తోంది. ఇక నిర్దేశించిన మొత్తం కన్నా అప్పు తక్కువగా ఉంటే లబ్ధిదారులు ఆ మొత్తాన్నే చెల్లించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది.

ఓటీఎస్‌ అమలుకు 03–11–2017న గృహ నిర్మాణ సంస్థ ఎండీ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన. ఈ తరహాలో 2014–19 మధ్యలో గత  టీడీపీ ప్రభుత్వానికి గృహ నిర్మాణ సంస్థ ఐదుసార్లు ప్రతిపాదనలు పంపింది. అయినా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వడ్డీతో సహా వసూలుకే అప్పట్లో బాబు ప్రభుత్వం మొగ్గు చూపింది.   

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనాలివే..
► పూర్తి యాజమాన్య హక్కులు రావడంవల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. 
► డీ పట్టా, పొజిషన్‌ సర్టిఫికెట్‌ స్థలాలకు మార్కెట్‌లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్ట్రర్‌ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువే. ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది. 
► డీ పట్టా, పొజిషన్‌ సర్టిఫికెట్లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారంలేదు. ఈ పథకం ద్వారా ఆస్తులను బదలాయించుకోవడంతో పాటు అమ్ముకోవచ్చు.

రుణం రూ.51 వేలు.. కట్టింది రూ.10 వేలు
17 ఏళ్ల క్రితం ప్రభుత్వ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం రూ.51 వేలకు చేరుకుంది. ఇంటిపై అధికారికంగా మాకు ఎలాంటి హక్కులు లేవు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎంత అప్పు ఉన్నా, కేవలం ఒకేసారి రూ.10 వేలు కడితే అప్పును పూర్తిగా రద్దుచేయడంతో, పాటు ఇంటి పత్రాలు ఇస్తామని చెప్పడంతో వెంటనే కట్టేశా. ఇల్లు నా పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. డాక్యుమెంట్లు తీసుకున్నా. 
    – పి. అనంతమ్మ, పగిడిరాయి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటీఎస్‌ అమలుకు గృహ నిర్మాణ సంస్థ బోర్డు మీటింగ్‌ లో చేసిన తీర్మానంకు సంబంధించిన ప్రతి   

ఇన్నేళ్లకు సొంతింటి కల నేరవేరింది
ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాం. ఇందులో మాకు నివసించే హక్కు తప్ప మా వారసులకు దీనిని బదలాయించే హక్కులేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఆ బెంగ తీరింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు బ్యాంకు రుణాలు పుట్టవు. ఇది మాలాంటి వాళ్లకి పెద్ద సమస్య. మా సమస్యకు సీఎం జగన్‌ శాశ్వత పరిష్కారం చూపారు. చాలా ఏళ్లుగా సొంతింటిలో ఉంటున్నప్పటికీ ఇప్పటికి నా సొంతింటి కల వాస్తవ రూపం దాల్చింది.     
– జంగాల నాగమ్మ, జయంతి కాలనీ, రాజుపాలెం గుంటూరు జిల్లా

దుష్ప్రచారం మానుకోవాలి
గతంలో వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ముందుకు రాని చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ చర్యను తప్పుపడుతున్నారు. బాబుకు పేదలు బాగుపడటం ఇష్టం ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం అసలు, వడ్డీలో రాయితీ ఇచ్చి, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బాబు బుద్ధి మార్చుకోవాలి.
    – దావులూరు దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌

మా ఆస్తి విలువ పెరిగింది
15 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాం. మాది ప్రభుత్వం ఇచ్చిన స్థలం. డీ పట్టా ఉండటంతో మార్కెట్‌ ధరలతో పోలిస్తే మా ఆస్తి విలువ 50 శాతం తక్కువే పలుకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ చేస్తుండటంతో ఇకపై మాది ప్రైవేట్‌ ఆస్తితో సమానం. దీంతో భవిష్యత్‌లో మేం అమ్మాలనుకున్నా కొనుగోలుకు ఎంతోమందిముందుకు వస్తారు. మాకు దిగులుండదు. ఇప్పుడు మా ఇల్లు రూ.35 లక్షల వరకు పలకనుంది.
    – కోనేటి రాజ్యలక్ష్మి, రమణయ్యపేట, కాకినాడ

ఇంటి పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు
సొంత ఇంట్లో ఉన్నా ఇంటిపై యాజమాన్య హక్కులు లేవని లోటు ఉండేది. 2007లో తీసుకున్న రుణం వడ్డీతో రూ.30 వేలు అయింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి వలంటీర్‌ చెప్పగానే ఎవరి ప్రోద్బలం లేకుండా రూ.10 వేలు చెల్లించాం. సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌ పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు.     
– కోకిల, పలమనేరు, చిత్తూరు జిల్లా

ఇంటి విలువ పెరిగింది
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంపూర్ణ గృహ హక్కు పథకం పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఉపయోగపడుతోంది. నేను 2010లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.28 వేలకు చేరుకుంది. ప్రభుత్వం ఓటీఎస్‌ ప్రవేశపెట్టడంతో వెంటనే రూ.10 వేలు చెల్లించా. నా ఇంటికి సంబంధించిన రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను అందించారు. ఇప్పటివరకు ఇల్లు నాదైనా, దానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంవల్ల ఎంతో ఇబ్బందిపడ్డాం. ప్రస్తుతం డాక్యుమెంట్లు పక్కాగా రావడంవల్ల నా ఇంటి విలువ ఇప్పుడు రూ.20 లక్షలకు చేరుకుంది. 
    – అల్లాబకాష్, నెరవాడ, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా  

మరిన్ని వార్తలు