ఏపీ గవర్నర్‌తో హరియాణ గవర్నర్‌ భేటీ

22 Aug, 2022 05:10 IST|Sakshi

సాక్షి, అమరావతి/మంగళగిరి/గుంటూరు మెడికల్‌ : రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆదివారం భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న బండారు దత్తాత్రేయకు రాజ్‌భవన్‌ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు గవర్నర్‌లు సమకాలీన రాజకీయ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయను విశ్వభూషణ్‌ హరిచందన్‌ సత్కరించారు. 

51 అడుగుల శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన దత్తాత్రేయ 
గుంటూరు జిల్లా మంగళగిరిలోని గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం (శివాలయం)వద్ద దాతలు మాదల వెంకటేశ్వరరావు, గోపీకృష్ణ, వెంకటకృష్ణ దంపతులు నిర్మించిన 51 అడుగుల పరమ శివుడి విగ్రహాన్ని హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆదివారం ఆవిష్కరించారు. ఆయన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని, గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గంజి చిరంజీవి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మునగాల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

బీజేపీ నాయకుడు రంగరాజు కుటుంబానికి పరామర్శ 
గుంటూరు రైలుపేటలోని బీజేపీ నేత జూపూడి రంగరాజు నివాసానికి బండారు దత్తాత్రేయ ఆదివారం వచ్చారు. రంగరాజు తల్లి హైమావతిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దత్తాత్రేయను జూపూడి కుటుంబ సభ్యులు యజ్ఞదత్తు, వనమా పూర్ణచంద్రరావు, మాజేటి ముత్యాలు, పలువురు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రోత్సహించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు