Special Status To AP: ఏపీకి ఎందుకు ప్రత్యేకహోదా ఇవ్వరు: హైకోర్టు

20 Nov, 2021 08:38 IST|Sakshi

ఇతర రాష్ట్రాలకు ఇచ్చారుగా..ఏపీకి ఇవ్వకపోవడానికి కారణాలేంటో చెప్పండి

సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి

కేంద్రానికి హైకోర్టు ఆదేశం

పూర్తి వివరాలు తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వానికీ ఆదేశం

తదుపరి విచారణ డిసెంబర్‌ 20కి వాయిదా

సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరో తెలియజేయాలని హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు కారణాలు ఏమిటో చెప్పాలంది. ప్రత్యేకహోదాకు సంబంధించి సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం కౌంటర్‌ దాఖలు చేయాలంది. పలు రాష్ట్రాలకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకహోదా ఇచ్చారో తెలియజేయాలంది. తదుపరి విచారణను డిసెంబర్‌ 20కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ప్రత్యేకహోదా ఇచ్చిన రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌కు సైతం ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చిన కేంద్రం ఆ హామీని అమలు చేయడం లేదని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రామచంద్రవర్మ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.

హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు
పిటిషనర్‌ తరఫు న్యాయవాది మంగెన శ్రీరామారావు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చారని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ విషయంలో తన హామీని నిలబెట్టుకోవడం లేదని తెలిపారు. హోదా ఇవ్వకుండా 2016లో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందన్నారు.

వాస్తవానికి ప్యాకేజీ–2 కింద కొన్ని రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వలేదని వివరించారు. ఈ ప్రోత్సాహకాలు అందుకుంటున్న రాష్ట్రాలన్నీ ప్రత్యేకహోదా ఉన్నవేనని చెప్పారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ ద్వారా ప్రత్యేకహోదా రాష్ట్రాలన్నింటికీ బడ్జెట్‌ ఆధారిత మద్దతు లభిస్తోందని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని, అయినా కేంద్రం స్పందించడంలేదని చెప్పారు. 

ఆ రాష్ట్రాలకు, ఏపీకి తేడా ఉంది
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పలు రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రత్యేకహోదా ఇచ్చేందుకు గీటురాయి ఉంటుందని, అలాంటి గీటురాయి పరిధిలోకి ఆంధ్రప్రదేశ్‌ వస్తున్నప్పుడు హోదా ఇవ్వడానికి అభ్యంతరం ఏముందని అడిగింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ స్పందిస్తూ.. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

ఆ పిటిషన్లతో తమకు సంబంధంలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులకు, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితులకు ఎంతో తేడా ఉందని హరినాథ్‌ చెప్పారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందని, ఈ నేపథ్యంలో నష్టపోయిన ఆ రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తలు