ఎస్పీపై హెడ్‌ కానిస్టేబుల్‌ ఫైర్‌ 

2 Sep, 2020 09:12 IST|Sakshi

ఆరోపణలపై విచారించకుండానే శిక్షిస్తే ఎలా? 

ఎస్పీ చర్యలతో సిబ్బంది మానసిక క్షోభ 

ఆయన వ్యక్తిగత ప్రచారం కోసం సిబ్బంది బలి  

మీడియాతో హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్బారావు  

సాక్షి, ఒంగోలు: ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ప్రకాశం పోలీసు శాఖలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లో రైటర్‌గా పనిచేస్తూ తాజాగా కొమరోలు పోలీసుస్టేషన్‌కు బదిలీ అయిన సుబ్బారావు స్థానిక కలెక్టరేట్‌ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. సుబ్బారావు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, పబ్లిక్‌తో దురుసుగా వ్యవహరించారంటూ ఏకంగా 38 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలను బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారించి చర్యలు తీసుకుంటే సంతోషిస్తాంగానీ ఆరోపణలపై ఎటువంటి విచారణ జరపకుండానే ఏకంగా తమను దొంగలుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఎస్పీని హెడ్‌ కానిస్టేబుల్‌ సూటిగా ప్రశ్నించారు. తాము విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు.

కనీసం హెచ్చరిక కూడా చేయకుండానే ఏకంగా బదిలీ వేటు వేయడం అంటే పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా ఉందన్నారు. ఇటీవలే తన భార్య చనిపోయిందని, తాను రెండో వివాహం చేసుకున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో బదిలీ చేయడం సమంజనం కాదన్నారు. మానసికంగా బాధపడే ఒక అధికారి ఎస్పీకి ఇచ్చే సలహాలతో నేడు జిల్లాలోని పోలీసు సిబ్బంది మొత్తం బాధపడుతున్నారని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో తన గురించి కథనాలు రావాలన్న ఎస్పీ కోరికకు సిబ్బంది బలవుతున్నారన్నారు. ఇలాగే కొనసాగి రామాంజనేయులులా తామూ ఆత్మహత్య చేసుకోవాలా..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీడియాతో మాట్లాడడం తప్పో.. ఒప్పో తనకు తెలియదని, ఒక వేళ ఏదైనా చర్య తీసుకున్నా అది తన వరకే పరిమితమై మిగిలిన వారు సంతోషంగా ఉంటే అదే చాలన్నారు.   

ఒంగోలు టూటౌన్‌ సీఐ విజ్ఞప్తి  
హెడ్‌ కానిస్టేబుల్‌ ఒకరు మీడియాతో మాట్లాడుతున్నారని తెలియగానే టూటౌన్‌ సీఐ ఎం.రాజేష్‌ హుటాహుటిన కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. సుబ్బారావుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు రావాలని కోరారు. అరెస్టు చేస్తానంటే చెప్పండి వస్తా..అంటూ ఆయన సీఐని కోరారు. ఇదే సమయంలో ట్రాఫిక్‌ డీఎస్పీ నుంచి కూడా పిలుపు రావడంతో సుబ్బారావు డీఎస్పీ వద్దకు వెళ్లి తనకు ఎస్పీ అంటే గౌరవం ఉందని, అయితే అవినీతిపరులంటూ ముద్రవేసి బదిలీ చేయడం మాత్రమే తమను ఆవేదనకు గురిచేసిందంటూ వివరించారు.  

సుబ్బారావును సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు  
ఒంగోలు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తూ ప్రజలతో అనుచిత ప్రవర్తనతో పాటు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్‌ కానిస్టేబుల్‌ వి.సుబ్బారావు సర్వీస్‌ రిజిస్టర్‌ను పరిశీలించామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రెండు క్రిమినల్‌ కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడని, అతని అనుచిత ప్రవర్తన, విధుల పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా ఇప్పటికే మూడు సార్లు సస్పెండ్‌ అయ్యారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం సుబ్బారావును సస్పెండ్‌ చేసి ఆయనపై ఎంక్వయిరీ వేశామని, విచారణలో వచ్చే నివేదిక ఆధారంగా శాఖాపరమైస చర్యలు, క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజారక్షణ కోసం ప్రకాశం పోలీస్‌ నిరంతరం పనిచేస్తోందని, ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా విధులు నిర్వహిస్తోందంటూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు