రైఫిల్‌ మిస్‌ఫైర్‌

6 Dec, 2021 03:08 IST|Sakshi

కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం): మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం రైఫిల్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ఈ ఘటనలో ఓ ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఏఆర్‌ విభాగంలో యార్లగడ్డ శ్రీనివాసరావు హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోని ఎలక్ట్రానికల్‌ ఓటింగ్‌ మెషిన్ల (ఈవీఎం) గోడౌన్‌ వద్ద ఆయనకు గార్డు డ్యూటీ వేశారు. ఆదివారం విధులకు హాజరైన శ్రీనివాసరావు సెక్యూరిటీ రూమ్‌లో భద్రపర్చిన కార్బన్‌ రైఫిల్‌ను శుభ్రం చేసేందుకు బయటకు తీశాడు. దానిని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది. రైఫిల్‌లోంచి దూసుకొచ్చిన బుల్లెట్‌ ఎదురుగా ఉన్న గోడకు తగిలి వెనక్కి వచ్చి శ్రీనివాసరావు ఛాతి ఎడమ భాగంలోంచి వీపు గుండా బయటికి వెళ్లింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

అక్కడే గార్డు డ్యూటీలో ఉన్న మరో కానిస్టేబుల్‌ ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు. ఏఆర్‌ ఏఎస్పీ ప్రసాద్, డీఎస్పీ విజయ్‌కుమార్, చిలకలపూడి సీఐ అంకబాబు తదితరులు హుటాహుటిన కలెక్టరేట్‌కు చేరుకున్నారు. శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని మణిపాల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రైఫిల్‌ ప్రమాదవశాత్తు పేలిందా లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఘటనపై విచారణ జరపాల్సిందిగా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు