అవినీతి ఖాకీ ‘సెల్ఫీ బాణం’ 

3 May, 2021 09:36 IST|Sakshi
ఏప్రిల్‌ 25న అంబులెన్స్‌లో వెళ్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటున్న కానిస్టేబుల్‌ గణేష్‌ (ఫైల్‌)  

వీఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎత్తుగడలో పావుగా మారిన గణేష్‌

పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తున్న వాస్తవాలు

సీఐ, ఎస్‌ఐలను టార్గెట్‌ చేస్తూ వీడియో వైరల్‌ 

తాడిపత్రి రూరల్‌: కరోనా సోకినా లీవు ఇవ్వడం లేదంటూ తాడిపత్రి రూరల్‌ కానిస్టేబుల్‌ గణేష్‌ బాబు చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో గణేష్‌ సెల్ఫీ వీడియో వైరల్‌ కావడంతో స్వయంగా ఎస్పీ సత్యయేసుబాబు రంగంలోకి దిగి ప్రకటన చేయాల్సి వచ్చింది. తాజాగా గణేష్‌ బాబు సెల్ఫీ వీడియో వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూనే ఓ సీఐ, ఎస్‌ఐ పేర్లను గణేష్‌ టార్గెట్‌ చేయడం చర్చనీయాంశమైంది.

వీఆర్‌లో ఉన్న ఓ ఖాకీ కనుసన్నల్లోనే సెల్ఫీ వీడియో వ్యవహారం జరిగినట్లు పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు. గతంలో తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహించిన సమయంలో అతనిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ హెడ్‌ కానిస్టేబుల్‌ను మూడుసార్లు వీఆర్‌కు పంపగా.. తిరిగి పైరవీలు చేసుకొని ఇదే ప్రాంతానికే బదిలీపై వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఆ హెడ్‌కానిస్టేబుల్‌ సిక్‌ లీవుపై వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్‌ నిర్వాహకులకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. 

వసూళ్ల పర్వం బయట పడిందనే... 
గణేష్‌ సెల్ఫీ వీడియో వెనుక ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ హస్తం ఉన్నట్లు స్పష్టమైంది. గతంలో తాడిపత్రి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆ కానిస్టేబుల్‌ విధులు నిర్వహించేవాడు. ఆ సమయంలో గ్యాంబ్లింగ్‌ ఆర్గనైజర్స్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ అక్రమ వసూళ్లకు తెరలేపిన అంశాన్ని ఉన్నతాధికారులకు ఆ స్టేషన్‌ ఎస్‌ఐ తెలియజేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల విచారణకు భయపడిన సదరు హెడ్‌కానిస్టేబుల్‌ తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు తన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులను రెచ్చగొట్టి వారి చేత ఆ ఎస్‌ఐకి వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపడమే కాక, మూకుమ్మడి సెలవుల పేరుతో బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో విచారణకు వచ్చిన డీఎస్పీతో ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్‌ గణేష్‌ కూడా గట్టిగా వాదించినట్లు తెలిసింది.

పావుగా మారిన గణేష్‌.. 
ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ ఓ ఎస్‌ఐపై కక్షగట్టి తగిన సమయం కోసం వేచి చూస్తున్న తరుణంలో గణేష్‌ రూపంలో అవకాశం దక్కింది. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. గత నెల 25న కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన గణేష్‌ను ఉన్నతాధికారులు ప్రత్యేక అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.

ఆ సమయంలో గణేష్‌తో వీడియో చేయించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయించాడు. తనను ఉద్యోగపరంగా ఎస్‌ఐ వేధిస్తున్నాడని, సెలవు అడిగినా ఇవ్వలేదని, కరోనా అని చెప్పినా డ్యూటీ చేయించాడని, సీఐ కూడా తనను మందలించాడని వీడియోలో పేర్కొన్నాడు. మూడు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో కానిస్టేబుల్‌ గణేష్‌ డిశ్చార్జి అయ్యాడు. అయితే ఈ మొత్తం అడ్డగోలు వ్యవహారంతో పోలీస్‌ శాఖ ప్రతిష్టను దెబ్బతీసిన అవినీతి ఖాకీపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

చదవండి: జెడ్పీ సీఈఓ కుటుంబంలో విషాదం..    
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత

మరిన్ని వార్తలు