ఏపీలో కరోనా మరణాలు లేవు.. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు

20 Apr, 2023 11:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12591 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.32 శాతంగా నమోదైంది. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అయితే, ఏపీలో మూడు కోవిడ్‌ మరణాలు సంభవించాయని వస్తున్న వార్తలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ, విశాఖపట్నంలో నమోదైన మూడు మరణాలకి కరోనా కారణం కాదని స్పష్టం చేశారు.

మరణించిన వారిలో ఇద్దరు వైరల్ న్యూమోనియా, ఒకరు ప్యాంక్రియాలైటిస్ కారణంగా మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. ఏపీలో కరోనా మరణాలు లేవని, కరోనా పరీక్షల సంఖ్యని 5 వేలకి పెంచామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలో గుర్తించిన 17 వేల మంది జ్వర బాధితులకి పరీక్షలు నిర్వహించి, కరోనాపై అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. 

ఏపీలో గత వారంలో పాజిటివిటీ రేటు కేవలం 2.12 శాతం మాత్రమే ఉందని, కరోనా పూర్తిగా అదుపులో ఉందని తెలిపారు. కరోనా ప్రస్తుత వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, రెండు రోజుల పాటు నిర్వహించిన కోవిడ్ మాక్ డ్రిల్ లో గుర్తించిన విషయాలని సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు అనవసర భయాందోళనలకి గురి కావద్దని తెలిపారు. దీర్ఘకాలిక రోగాలున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చదవండి: టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..

మరిన్ని వార్తలు