‘చిరు’కు రుచి మరిగి లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు..

15 Dec, 2021 15:34 IST|Sakshi

సాక్షి, కర్నూలు (హాస్పిటల్‌): శ్రీధర్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. కరోనా సెకండ్‌ వేవ్‌లో కంపెనీ అతనికి ఇంటి నుంచే పని చేయాలని బాధ్యతలు అప్పజెప్పింది. ఆఫీసులో అటూ ఇటూ తిరుగుతూ పనిచేసే అతను ఇంట్లో ఒకేచోట గంటల తరబడి కూర్చోవడమే గాక కుటుంబసభ్యులు గంటకోసారి చేసి పెట్టే చిరుతిళ్లు తింటూ లావైపోయాడు. మొదట్లో 65 కిలోల బరువు ఉండే అతను ఇప్పుడు 85 కిలోలకు పెరిగాడు. దీంతో పెరిగిన బరువును తగ్గించేందుకు న్యూట్రిషన్‌ సెంటర్లవైపు పరుగులు తీస్తున్నాడు.  

►నారాయణరెడ్డి కేంద్ర సంస్థలో పనిచేసి రెండేళ్ల క్రితమే రిటైరయ్యాడు. అతను రిటైరైనప్పటి నుంచి కోవిడ్‌ ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రతిరోజూ ఉదయమే గంటసేపు వాకింగ్‌ చేసేవాడు. లాక్‌డౌన్, కోవిడ్‌ నిబంధనల మేరకు ఇంట్లోనే గడపాల్సి వచ్చి ంది. కోవిడ్‌ తగ్గుముఖం పట్టినా కుటుంబసభ్యులు అతన్ని బయటకు వెళ్లనీయలేదు. దీంతో సన్నగా 65 కిలోల బరువుండే అతను ఇప్పుడు 80 కిలోలకు చేరాడు. దీంతో అతనిలో బీపీ, షుగర్‌ స్థాయిలు బాగా పెరిగాయి. ఈ కారణంగా మందుల వాడకమూ పెరిగింది. బరువు తగ్గేందుకు ఇప్పుడు ట్రెడ్‌మిల్‌ కొనుగోలు చేసి ఇంట్లోనే వాకింగ్‌ చేస్తున్నాడు.  

చదవండి: (Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు)

వీరిద్దరే కాదు కోవిడ్‌ కారణంగా బరువు పెరిగి ఇబ్బంది పడే వారి సంఖ్య జిల్లాలో వేలల్లో ఉంది. కోవిడ్‌ వైరస్‌ను ఒక్కటే తీసుకురాలేదు. దాంతో పాటు పరిస్థితుల ప్రభావం వల్ల మానవుల జీవనశైలినే మార్చేసింది. దీంతో ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. బద్దకం పెరిగిపోయి ఊబకాయం అధికమైంది. దీంతో పాటు జీవనశైలి జబ్బులూ పెరిగిపోయాయి. వీటిని నియంత్రించేందుకు ఇప్పుడు ఆన్‌లైన్‌ యోగా క్లాసులు, ఇంట్లో ట్రెడ్‌మిల్‌ వాకింగ్‌లు గట్రా చేస్తూనే నోటిని కట్టడి చేస్తూ కడుపు కాల్చుకుంటున్నారు.

 
 
జిల్లాలో 2020 మార్చి 28వ తేదీన తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. దానికి నాలుగు రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలైంది. 20 నెలల క్రితం నాడు మొదలైన కోవిడ్‌ కేసుల సంఖ్య నేడు 1.25 లక్షల దాకా చేరుకున్నాయి. దీనిబారిన పడి 854 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ రోజూ ఒకటో, రెండో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొదటి అల, రెండో అల పేరుతో దూసుకొచ్చిన కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఆంక్షలు ఫలితంగా చాలా మందికి శారీరక శ్రమ కరువైంది.

వాకింగ్‌ చేయాలంటే మైదానాలు, పార్కులు మూతపడ్డాయి. వీధుల్లో నడవాలంటే మోకాళ్ల నొప్పులు వస్తాయని భయం. జిమ్‌కు వెళ్లాలన్నా వాటిపైనా ఆంక్షలు. ఇప్పుడిప్పుడే అవి తెరుచుకున్నా రోజుల తరబడి విశ్రాంతి తీసుకున్న మనసు బద్దకిస్తోంది. తెగించి జిమ్‌కు వెళ్లినా ఒకటి రెండు రోజులకే మళ్లీ మనసు విశ్రాంతినే కోరుకుంటోంది. దీనికితోడు కూర్చుని తినే కార్యక్రమం అధికం కావడంతో జిల్లాలో గతంలో ఉన్న వారితో పోలిస్తే అదనంగా 30 శాతం మంది స్థూలకాయులుగా మారారని వైద్యులు పేర్కొంటున్నారు.  

చదవండి: (కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా తగ్గుతాయి..)

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇబ్బందులు 
ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారిలో 90 శాతం మందికి కరోనా సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు. ఈ కారణంగా ఇంట్లోనే ఉండటంతో చిరుతిళ్లపై మనసు లాగడంతో వారికి వండిపెట్టేవారూ రెడీ అయ్యారు. ఈ కారణంగా అవసరం లేకపోయినా చిరుతిళ్లు తింటూ పనిచేసుకునే వారు అధికమయ్యారు. దీంతో చాలా మందికి శరీరంలో అవసరమైన దానికంటే అధికంగా కేలరీలు పెరిగి స్థూలకాయం వచ్చింది.


 
మారిన ఆహారపు అలవాట్లు 
చాలా మందికి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. రెండేళ్ల క్రితం రోజుకు మూడు పూటలు తినేవారు కరోనా దెబ్బకు ఐదారు పూటలు (స్నాక్స్‌తో కలిపి) లాగించేశారు. అధిక శాతం ఇంట్లోనే ఉండటం, కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే ప్రోటీన్స్‌ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలనే వాదన ఒకటి రావడంతో చాలా మంది ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో శారీరక శ్రమను గాలికి వదిలేశారు. దీంతో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  

చదవండి: (సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా?)

ఊబకాయంతో నష్టాలు 
ఊబకాయం కారణంగా పది మందిలో తిరగాలంటే ఇబ్బంది. ఇతరులు సన్నగా, నాజూగ్గా ఉంటే వీరు చురుకుతనం తగ్గిపోయి బరువుగా అడుగులు వేయాల్సి వస్తుంది. అప్పటికే ఒంట్లో బీపీ, షుగర్‌లు ఉంటే వాటి స్థాయిలు మరింత పెరిగి మందుల డోసు కూడా అధికమైంది. దీనికితోడు అధిక బరువు కారణంగా కీళ్లనొప్పులు, ఆయాసం, గుండెజబ్బులు, థైరాయిడ్‌ వంటి ఆరోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది.  

కిడ్నీలపై భారం పడుతుంది 
ఊబకాయం వల్ల కిడ్నీ పనితనంపై భారం పెరిగే అవకాశం ఉంది. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 30 దాటితే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతాయి. దీంతో పాటు స్మోకింగ్‌ అలవాటు ఉంటే రక్తనాళాలు కుచించుకుపోయి రక్తసరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో కిడ్నీ ఎక్కువగా పనిచేయడం వల్ల ప్రొటీన్స్‌ లీక్‌ అవుతాయి. ఈ కారణంగా కాళ్లవాపులు వస్తాయి. ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే  రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.   –డాక్టర్‌ పీఎల్‌. వెంకటపక్కిరెడ్డి,నెఫ్రాలజిస్టు, కర్నూలు 

బరువు నియంత్రణా ముఖ్యమే
కోవిడ్‌ అనంతరం ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆహారం తీసుకోవడంలో వచ్చిన మార్పులే. అధిక బరువును  ఆహార నియంత్రణతోనే తగ్గించుకోవాలి. ఈ మేరకు శరీరానికి అవసరమైన కేలరీలను వారి బరువు, వయస్సుకు తగినట్లుగా తీసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి.  రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీరు తాగాలి. ఇదే క్రమంలో తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌లు, జంక్‌ఫుడ్‌లు మానేయాలి. 
– డాక్టర్‌ జి.రమాదేవి, డైటీషియన్, కర్నూలు   

మరిన్ని వార్తలు