ఇంటి వద్దే ఉచితంగా వైద్యం

28 Sep, 2020 04:07 IST|Sakshi

నేటి నుంచి ప్రతి ఇంటికీ ఏఎన్‌ఎంలు 

కోటిన్నర కుటుంబాలకు హెల్త్‌ స్క్రీనింగ్‌ 

సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దే ఉచితంగా వైద్యం అందించే సదుపాయం దేశంలో తొలిసారిగా ఏపీలో మొదలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది ఏఎన్‌ఎంలు సోమవారం నుంచి 1.48 కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారి  ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి సుమారు 5.34 కోట్ల మంది ప్రజల వివరాలను నమోదు చేయనున్నారు. ప్రమాదకరంగా పరిగణించే ఏడు రకాల జబ్బులను గుర్తించడంతోపాటు వైద్య సదుపాయం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా డేటాను నమోదు చేస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరోగ్య రంగాన్ని సంస్కరించి ప్రజల ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.  

నెలలో పూర్తయ్యేలా ప్రణాళిక.. 
► ఒక్కో ఏఎన్‌ఎంకు 500 నుంచి 800 ఇళ్ల వరకు కేటాయించారు.  
► రోజుకు 25 నుంచి 30 ఇళ్లలో స్క్రీనింగ్‌ చేపట్టి నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏఎన్‌ఎంలకు 40వేల మంది ఆశా కార్యకర్తలు సాయం అందిస్తారు. 
► స్క్రీనింగ్‌ ద్వారా సేకరించే ఆరోగ్య వివరాలు ఎన్‌సీడీ అండ్‌ ఏఎంబీ యాప్‌లో నమోదవుతాయి. అక్కడ నుంచి సెంట్రల్‌ పోర్టల్‌కు అనుసంధానం అవుతాయి. 

నాలుగు కేటగిరీలు... 
► స్క్రీనింగ్‌ పరీక్షల కోసం ప్రజలను నాలుగు విభాగాలుగా విభజించారు. 
► ఆరేళ్ల లోపు చిన్నారులు, 6 – 20 ఏళ్ల లోపువారు, 20 – 60 ఏళ్ల వయసు లోపు వారు, 60 ఏళ్లు దాటిన వారు అనే విభాగాలుగా వర్గీకరించి ఆరోగ్య వివరాల సేకరణకు 9 నుంచి 53 ప్రశ్నలు రూపొందించారు. 

రెండో దశలో ట్రీట్‌మెంట్‌ 
► తొలుత 5.34 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని స్క్రీనింగ్‌చేసి ఎవరికి ఎలాంటి జబ్బులు, లక్షణాలున్నాయో గుర్తిస్తారు. ఎలాంటి చికిత్స అవసరమో సూచిస్తారు. పెద్ద జబ్బులైతే నేరుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పంపిస్తారు. ఏఎన్‌ఎంలు సేకరించే హెల్త్‌ డేటాను ఆరోగ్యశ్రీ కార్డుల్లో నిక్షిప్తం చేసి పౌరుల ఆరోగ్య వివరాలను భద్రపరుస్తారు. సత్వరమే మెరుగైన వైద్యం అందేలా ఇది ఉపకరిస్తుంది.   

వీటిపై ప్రధాన దృష్టి 
► ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రధానంగా ఏడు రకాల జబ్బులను గుర్తించి పరీక్షలు నిర్వహించి వైద్య సదుపాయం అందేలా చర్యలు చేపడతారు. 
► మధుమేహం  
► హైపర్‌ టెన్షన్‌  
► లెప్రసీ (కుష్టువ్యాధి) లక్షణాలు 
► క్షయ ప్రాథమిక లక్షణాలు  
► నోరు, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్లు లాంటివి 
► చిన్నారులు, మహిళల్లో రక్తహీనత  
► చిన్నారుల్లో వినికిడి లోపం, ఇతరత్రా పుట్టుకతో వచ్చే జబ్బులను గుర్తించి చికిత్స అందేలా చర్యలు. 

సామాన్యులకు మరింత చేరువలో వైద్యం 
‘చాలామందికి జీవనశైలి జబ్బులు ఉన్నట్లు కూడా తెలియదు. అలాంటి వారందరి కోసం ఇంటివద్దకే వెళ్లి పరీక్షలు నిర్వహించి వైద్యం అందించే కార్యక్రమం దేశంలో మొదటి సారి మన రాష్ట్రంలోనే మొదలవుతోంది. ఇది సామాన్యులకు వైద్యాన్ని మరింత చేరువ చేస్తుంది’ 
– డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా