ప్రాణం నిలబెట్టిన ఆరోగ్యశ్రీ.. రూ.25 లక్షల చికిత్స ఉచితంగా

16 Mar, 2022 05:25 IST|Sakshi
ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం గుండెను తరలిస్తున్న వైద్యులు, సిబ్బంది, శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న రాంబాబు

గుండె మార్పిడితో ఓ యువకుడికి పునర్జన్మ 

బెంగళూరులోని ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స  

రూ. 25 లక్షలు ఖర్చయ్యే చికిత్స ఉచితంగా పూర్తి 

కోలుకుంటున్న యువకుడు.. ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు 

సాక్షి, అమరావతి: గుండె జబ్బుతో ప్రాణాపాయంలో ఉన్న ఓ యువకుడికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పునర్జన్మ ప్రసాదించింది. రూ. 25 లక్షల వరకూ ఖర్చయ్యే హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (గుండె మార్పిడి) చికిత్సను ప్రభుత్వం ఉచితంగా చేయించింది. దీంతో ఆ పేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం నరుకుల్లపాడు గ్రామానికి చెందిన 27 ఏళ్ల బుడ్డె రాంబాబు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తాడు.

అతనికి భార్య శిరీష, ఒకటిన్నర సంవత్సరాల కుమారుడు రిషి ఉన్నారు. ప్రస్తుతం శిరీష 8 నెలల గర్భిణి కూడా. గతేడాది జూన్‌లో రాంబాబు గుండెల్లో నొప్పిగా అనిపించి విజయవాడలోని కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి గుండె 70 శాతం పనిచేయడం లేదని నిర్ధారించారు. హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఒక్కటే మార్గమని తేల్చి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యానికి రూ. 25 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పడంతో.. అంత ఆర్థిక స్తోమత లేని కుటుంబ సభ్యులు రాంబాబును ఇంటికి తీసుకువచ్చేశారు.

అయితే గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకుల ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను సంప్రదించగా ఆయన ఆరోగ్యశ్రీ అధికారులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ అధికారులు రాంబాబును బెంగళూరులోని వైదేహీ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రికి పంపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి గుండెను ఈ నెల 10న వైద్యులు రాంబాబుకు అమర్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు తమను ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా ఆదుకుందని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  

మా పాలిట వరం 
కూలి పనులు చేసుకునే కుటుంబం మాది. రాంబాబు నా పెద్ద కుమారుడు. గుండె సరిగా పని చేయడం లేదని వైద్యులు చెప్పినప్పుడు నా కుమారుడు దక్కడేమో అని ఇంటిల్లిపాది ఎంతో ఆందోళన చెందాం. వాడికి ఏమైనా అయితే మనవడు, కోడలు, ఆమె కడుపులోని బిడ్డ అనాథలుగా మారతారని భయపడ్డాం. గుండెమార్పిడి శస్త్రచికిత్సకు రూ. 25 లక్షలు ఖర్చు చేయడం మా వల్ల కాని పని. ఆరోగ్యశ్రీ మా పాలిట వరంగా మారింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా గుండె మార్పిడి చేయించింది. నా కుమారుడికి పునర్జన్మ ప్రసాదించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరువలేం. 
– జమ్మయ్య, రాంబాబు తండ్రి 

మరిన్ని వార్తలు