విశాఖలో హార్ట్‌ వాల్వుల తయారీ యూనిట్‌ 

30 Dec, 2021 05:11 IST|Sakshi

మెడ్‌టెక్‌ జోన్‌లో వచ్చే డిసెంబర్‌ నాటికి ఏర్పాటు చేయనున్న ట్రాన్స్‌లూమినా 

ఆసియాలోనే అతిపెద్ద యూనిట్‌గా గుర్తింపు 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీకి విశాఖపట్నం కేంద్రం కానుంది. విశాఖలోని ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ (ఏఎంటీజెడ్‌)లో వివిధ రకాల వాల్వుల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ట్రాన్స్‌లూమినా సంస్థ ఇటీవల భూమిపూజ చేసింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌ పనులను వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తి చేయనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది.

అనంతరం వాల్వుల తయారీ ప్రారంభించే అవకాశం ఉంది. అంటే 2023లో విశాఖపట్నం నుంచే హార్ట్‌ వాల్వులు తయారుకానున్నాయి. ఈ యూనిట్‌లో ట్రాన్స్‌కేథటర్, మిట్రల్, ట్రైకుస్పిడ్‌ వాల్వులను తయారు చేయనున్నారు. ఈ యూనిట్‌ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి పెట్టనున్నారు? ఎంతమందికి ఉపాధి లభిస్తుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.  

బైపాస్‌ సర్జరీ అవసరం లేకుండానే.. 
వాస్తవానికి గుండె వాల్వులకు సమస్య వస్తే బైపాస్‌ సర్జరీ చేయడం పరిపాటి. ఈ ప్రక్రియలో ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావడంతోపాటు భారీగా కోతలు పడతాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కేథటర్‌ హార్ట్‌ వాల్వ్‌ ఇంప్లాంటేషన్‌ ప్రక్రియ ముందుకొచ్చింది. ఈ వాల్వుల వల్ల బైపాస్‌ సర్జరీ అవసరం లేకుండానే.. చిన్నపాటి రంధ్రంతో ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా గుండె శస్త్రచికిత్స పూర్తిచేసే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఈ యూనిట్‌లో ప్రధానంగా ట్రాన్స్‌కేథటర్‌ వాల్వులను తయారు చేయనున్నట్టు ట్రాన్స్‌లూమినా కంపెనీ ఎండీ గుర్మీత్‌సింగ్‌ చాగ్‌ ఒక న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నూతన తరహా వాల్వుల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, నిపుణులతో సంప్రదించామని ఆయన వెల్లడించారు.   

మరిన్ని వార్తలు