మతిస్థిమితం లేని యువతికి చిత్రహింసలు 

16 Jun, 2021 09:12 IST|Sakshi

మంట కలిసిన మానవత్వం 

స్థానికుల ఫిర్యాదుతో ఐసీడీఎస్, దిశ, పోలీసుల ప్రవేశం  

నెల్లూరు సఖి కేంద్రానికి బాధితురాలి తరలింపు 

సాక్షి, నెల్లూరు: మతిస్థిమితం లేని ఓ యువతిని బంధువులే చిత్రహింసలకు గురి చేస్తున్న హృదయ విదారక ఘటన బాలాయపల్లిలో వెలుగుచూసింది. ఐసీడీఎస్‌ అధికారుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం యార్లపూడి గ్రామానికి చెందిన పద్మకు చిన్న వయసు నుంచే మతిస్థిమితం లేదు. ఆమె చిన్న తనంలోనే తల్లి మృతి చెందగా, తండ్రి ఎటో వెళ్లిపోయాడు. పద్మ తన మేనమామ గగనం మల్లికార్జున, ప్రసన్న దంపతుల సంరక్షణలో ఉంటుంది.

ఏడాది క్రితం పద్మకు అక్క వరసయ్యే బాలాయపల్లిలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న సుమతి, బావ వెంకటయ్య వద్ద మేనమామ వదిలి వెళ్లిపోయాడు. అయితే కొంతకాలం నుంచి పద్మను వారు చిత్రహింసలకు గురి చేసి తీవ్రంగా కొడుతున్నారు. పద్మను ఇంట్లో నిర్బంధించి పైశాచికంగా ప్రవర్తించేవారు. ఈ విషయం వైఎస్సార్‌సీపీ నాయకురాలు రాయి దేవికాచౌదరి దృష్టికి వెళ్లడంతో ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఐసీడీఎస్‌ సీడీపీఓ జ్యోతి, ఎస్సై నరసింహారావు, నెల్లూరు దిశ పోలీసులు మంగళవారం పద్మ నివాసం వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గాయాలతో ఉన్న పద్మను చూసి నివ్వెరపోయారు. వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి, పక్కనే ఉన్న సఖి కేంద్రానికి తరలించారు. పద్మకు ప్రభుత్వం నుంచి దివ్యాంగుల పింఛన్‌ వస్తున్న విషయం గమనార్హం.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు