ఏపీ ప్రజలకు అలర్ట్‌.. ఎండలు మరింత తీవ్రం

23 Apr, 2022 11:19 IST|Sakshi

నాలుగు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు 

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన 

సాక్షి, అమరావతి: వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. అనేక చోట్ల 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వేసవి తీవ్రత, ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం అల్లూరి  సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

చదవండి: తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా?

విశాఖ, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూ రు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 24న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో  45నుంచి 46 డిగ్రీలు, అల్లూరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో 42నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

25న అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో  45నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో 42నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 26న కూడా 43నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

మరిన్ని వార్తలు