భారీగా వైద్య ఉపకరణాల కొనుగోలు

9 Sep, 2021 03:22 IST|Sakshi

థర్డ్‌వేవ్‌ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం 

300 నియోనేటల్‌ వెంటిలేటర్ల కొనుగోలు  

మరో 50 హైఫ్లో వెంటిలేటర్లు కూడా 600 ఇన్‌ఫ్యూజన్‌ పంపులకు ఆర్డరు 

1,600 రోగి పర్యవేక్షణ యంత్రాలు 

చిన్నారులకు ఇమ్యునోగ్లోబిలిన్‌ 

ఇంజక్షన్లు.. ఈ నెలాఖరుకు అన్ని ఉపకరణాలు రాష్ట్రానికి చేరేలా చర్యలు 

సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య ఉపకరణాల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు కొనుగోళ్లకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. 28 రోజుల్లోపు వయసున్న వారిని నియోనేటల్‌ అంటారు. ఇలాంటి వారికి కోవిడ్‌ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. పదేళ్లలోపు చిన్నారులు కూడా శ్వాసకోశ ఇబ్బందులకు గురైన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తమయ్యారు. దీనికోసమే ఎప్పుడూ లేనంతగా 300 నియోనేటల్‌ వెంటిలేటర్లను కొనుగోలు చేశారు. వీటిలో ఇప్పటికే 110 వెంటిలేటర్లు రాష్ట్రానికి చేరుకోగా, ఈనెల 15లోగా మిగతావి రానున్నాయి. 

 20 వేల ఆక్సిజన్‌ మాస్కులు 
వెంటిలేటర్‌ లేదా ఆక్సిజన్‌ పడకల మీద వైద్యం పొందుతున్నప్పుడు ఆక్సిజన్‌ మాస్కులు అత్యవసరం. అందుకే 20 వేల మాస్కులు కొనుగోలు చేశారు. ఇవి ఇప్పటికే సరఫరా అయ్యాయి. చిన్నారులకు ఇచ్చే ఇమ్యునోగ్లోబిలిన్‌ ఇంజెక్షన్లు 10 వేలు ఆర్డరు ఇవ్వగా, 1,750 సరఫరా అయ్యాయి. మిగతావి నెలాఖరుకు వచ్చే అవకాశం ఉంది. ఇబూప్రొఫిన్‌ సిరప్, అజిత్రోమైసిన్‌ ఓరల్, పారాసిటమాల్‌ ఓరల్, ప్రోబయోటిక్‌ సాచెట్స్‌ వంటివన్నీ కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ ఈనెల 15లోగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లకు చేరుకోనున్నాయి. ఈ నెలాఖరుకు రాష్ట్రవ్యాప్తంగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు కూడా పూర్తవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు