డీసీఐ చేతికి భారీ డ్రెడ్జర్‌ 

16 Mar, 2022 05:17 IST|Sakshi

12 వేల క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం ఉన్న డ్రెడ్జర్‌ కొనుగోలు 

మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా కొచ్చి షిప్‌యార్డులో తయారీ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) చేతికి భారీ డ్రెడ్జర్‌ రానుంది. 12 వేల క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం గల ట్రెయిలింగ్‌ సక్షన్‌ హాపర్‌ డ్రెడ్జర్‌ (టీఎస్‌హెచ్‌డీ) కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించింది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుకానున్న ఈ డ్రెడ్జర్‌ను కొచ్చి షిప్‌యార్డులో తయారు చేయనున్నారు.

ఈ తరహా భారీ డ్రెడ్జర్‌ ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేదు. వాస్తవానికి వచ్చే పదేళ్లలో దేశంలో ఏకంగా 310 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మేర డ్రెడ్జింగ్‌ చేయాల్సి ఉంటుందని అంచనా. ప్రస్తుతం డీసీఐ చేతిలో రూ.900 కోట్ల విలువైన డ్రెడ్జింగ్‌ ఆర్డర్లు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా కొత్తగా భారీ డ్రెడ్జర్లు అవసరమైన నేపథ్యంలో ఈ భారీ డ్రెడ్జర్‌ను కొనుగోలు చేయాలని డీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి ‘డీసీఐ డ్రెడ్జ్‌ బ్రహ్మపుత్ర’ అని నామకరణం చేశారు.

డ్రెడ్జర్‌ కొనుగోలుకు సంబంధించి ఈ నెల 17న ఢిల్లీలో ఒప్పంద కార్యక్రమం నిర్వహించనున్నట్టు డీసీఐ వర్గాలు తెలిపాయి. దీని కొనుగోలుకు సుమారు రూ.వెయ్యి కోట్లు వెచ్చించనున్నట్లు తెలిసింది.  డ్రెడ్జర్‌ పనితీరును పరిశీలించిన తర్వాత మరో రెండు భారీ డ్రెడ్జర్లను కొనుగోలు చేసేందుకు డీసీఐ సిద్ధమవుతున్నట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు