భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా వరద

20 Aug, 2022 08:21 IST|Sakshi

రెండు చోట్లా రెండో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం బ్యారేజ్‌ నుంచి 14.94 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి

వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో ఎగువన తగ్గుతున్న వరద

కృష్ణాలో నిలకడగా వరద.. శ్రీశైలంలోకి 2.89 లక్షల క్యూసెక్కులు

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 1.23 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి

వంశధారలో స్థిరంగా వరద

గొట్టా బ్యారేజ్‌ నుంచి 20 వేల క్యూసెక్కులు కడలిలోకి

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్‌/సత్రశాల (రెంటచింతల)/విజయపురిసౌత్‌: గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 47.7 అడుగులు, ధవళేశ్వరం వద్ద 15 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా విడుదల చేస్తున్న జలాల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 15,05,850 క్యూసెక్కులు వస్తుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 14,94,850 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం(బేసిన్‌)లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇచ్చాయి. దాంతో ఎగువన గోదావరిలో వరద తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లోకి వరద 7.40 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన ఉన్న తుపాకులగూడెం బ్యారేజ్‌లోకి 8.84 లక్షలు, సీతమ్మసాగర్‌లోకి 11.47 లక్షల క్యూసెక్కులకు ప్రవాహం తగ్గింది. ఆ నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టనుంది.

స్థిరంగా వంశ‘ధార’
వర్షాల ప్రభావం వల్ల వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 22,809 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ఆయకట్టుకు 2,215 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 20,594 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళిలోనూ వరద కొనసాగుతోంది. తోటపల్లి బ్యారేజ్‌లోకి 6,358 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,838 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్ట మీదుగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

నిలకడగా కృష్ణమ్మ
బేసిన్‌లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణాలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,89,909 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 18 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు, కుడి, ఎడమ  విద్యుత్కేంద్రాల ద్వారా 62,665 క్యూసెక్కులు, స్పిల్‌ వే 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,23,864 క్యూసెక్కులు.. మొత్తం 3,06,217 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జున సాగర్‌లోకి 1,74,167 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,831, ఎడమ కాలువకు 8,193, ఏఎమ్మార్పీకి 600, వరద కాలువకు 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,927, స్పిల్‌ వే 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,23,216 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 586.2 అడుగుల్లో 301.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

పులిచింతల ప్రాజెక్టులోకి 1,36,582 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం ద్వారా 8 వేలు, స్పిల్‌ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,30,616 క్యూసెక్కులు.. మొత్తం 1,38,616 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,35,847 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,797 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,23,050 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు.

మరిన్ని వార్తలు