ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో భారీ ఫ్రాడ్‌

10 Sep, 2021 05:17 IST|Sakshi

టెరా సాఫ్ట్‌కు అడ్డగోలుగా కాంట్రాక్టు 

బ్లాక్‌ లిస్టులో ఉన్న కంపెనీకి అవకాశం

ఫోర్జరీ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌తో మోసం

టెండర్ల కమిటీలో చంద్రబాబు బినామీ వేమూరి 

ఇది రూ.330 కోట్ల తొలిదశ ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో అవినీతి బాగోతం మాత్రమే

సీఐడీ దర్యాప్తులో బట్టబయలైన అక్రమాలు

వేమూరి, టెరాసాఫ్ట్, అప్పటి అధికారులపై కేసు నమోదు 

19 మందిపై ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి సమర్పించిన సీఐడీ

అన్ని దశల్లో కలిపి రూ.2వేల కోట్ల కుంభకోణంగా అంచనా

సాక్షి, అమరావతి: ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్ల టెండర్లలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతం బట్టబయలైంది. నాటి సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, బినామీ వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టెరాసాఫ్ట్‌) సంస్థకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం ఆధారసహితంగా నిర్ధారణ అయింది. నిబంధనలు ఏమార్చి.. కంపెనీని బ్లాక్‌లిస్టు నుంచి హడావుడిగా తొలగించి.. ఫోర్జరీ పత్రాలు సృష్టించి.. టెక్నికల్‌ కమిటీలో అస్మదీయుడిని నియమించి.. నిపుణుల అభ్యంతరాలను బేఖాతర్‌ చేసి రూ.330 కోట్ల విలువైన ఫైబర్‌నెట్‌ టెండర్లను కట్టబెట్టేశారనే నిజం సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలింది. నాసిరకం పరికరాలు సరఫరా చేసినా సరే అడ్డగోలుగా రూ.119.98 కోట్ల మేర బిల్లులు చెల్లించారని స్పష్టమైంది.

మిగిలిన దశల టెండర్లతో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర సాగిన ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్ల వ్యవహారంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన సీఐడీ ఫైబర్‌ నెట్‌ టెండర్లలో అవినీతిని ఆధారసహితంగా బట్టబయలు చేసింది. మొదటి దశ టెండర్లలో అవకతవకలకు పాల్పడిన కేసులో వేమూరి హరికృష్ణప్రసాద్‌ (టీడీపీ ప్రభుత్వంలో ఇ–గవర్నెన్స్‌ అథారిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు), కె.సాంబశివరావు (నాటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ– ఎండీ) సహా మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ను గురువారం న్యాయస్థానానికి సమర్పించింది. ఆ అవినీతి బాగోతం ఇదిగో ఇలా సాగింది...

టెరాసాఫ్ట్‌ కోసం టెండర్‌ గడువు పొడిగింపు..
మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి మొదటి దశలో రూ.330 కోట్లకు ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ 2015లో ఇన్‌క్యాప్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఏపీ) ద్వారా ఈ –టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు 2015 జూలై 31 వరకు గడువు ఇస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఒక్క రోజు ముందు అంటే జూలై 30న టెండర్ల దాఖలు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరా సాఫ్ట్‌ సంస్థ టెండర్‌ దాఖలు చేయకపోవడమే అందుకు కారణం.

ఫోర్జరీ పత్రాలతో అర్హత
ఫైబర్‌ నెట్‌ టెండర్లలో పాల్గొనేందుకు ఫోర్జరీ అర్హత పత్రాలను సృష్టించి టెరాసాఫ్ట్‌ కంపెనీ కనికట్టు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్‌ దాఖలు చేసే కంపెనీ మరో రెండు సంస్థలతో కలసి కన్సార్టియంగా ఏర్పడాలి. కన్సార్టియం లీడ్‌ కంపెనీకి మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉండాలి. మిగిలిన రెండు కంపెనీలకు ఏడాదికి కనీసం రూ.50 కోట్ల చొప్పున టర్నోవర్‌ ఉండాలి. అయితే కన్సార్టియంలో మూడో కంపెనీ హారిజన్‌ బ్రాడ్‌కాస్ట్‌ ఏర్పాటై అప్పటికి 8 నెలలే అయింది. మరోవైపు ఫైబర్‌ నెట్‌ రంగంలో పనులు చేసినట్లు టెరాసాఫ్ట్‌ ఫోర్జరీ పత్రాలు సమర్పించింది.

సిగ్నం డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు డిజిటల్‌ హెడ్‌ ఎండ్‌ పరికరాలు సరఫరా చేసినట్టు ఫోర్జరీ పత్రాలు సృష్టించింది. వాస్తవానికి మోడర్న్‌ కమ్యూనికేషన్‌ – బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టమ్స్‌ అనే సంస్థ ఆ పరికరాలను సరఫరా చేసింది. టెరాసాఫ్ట్‌ మోసాలపై కొన్ని సంస్థలు ఫైబర్‌ నెట్‌ టెక్నికల్‌ కమిటీకి ఫిర్యాదు చేయడంతో నిర్ధారించుకునేందుకు సిగ్నం డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఈ మెయిల్‌ పంపారు. అయితే టెరాసాఫ్ట్, అప్పటి ప్రభుత్వ పెద్దల హెచ్చరికలతో గత్యంతరం లేక ఆ పత్రాలు సరైనవేనని సిగ్నం సంస్థ పేర్కొంది. సీఐడీ విచారణలో సిగ్నం డిజిటల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ యాజమాన్యం ఆ విషయాన్ని నిర్ధారించింది. 

టెండర్ల కమిటీలోనూ వేమూరి
టీడీపీ పెద్దలు తమ బినామీ వేమూరి హరికృష్ణప్రసాద్‌ను ప్రభుత్వ ఇ–గవర్నింగ్‌ అథారిటీ ఆధ్వర్యంలోని గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా నియమించారు. అనంతరం ఆయన్ను ఫైబర్‌నెట్‌ టెండర్ల ప్రక్రియను పరిశీలించే సాంకేతిక కమిటీలో సభ్యుడిని కూడా చేశారు. నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియలో పాల్గొనే సంస్థలతో అనుబంధం ఉన్నవారు సాంకేతిక కమిటీలో ఉండకూడదు. కానీ వేమూరి అప్పటికే టెరా సాఫ్ట్‌ అనుబంధ కంపెనీ టెరా మీడియా క్లౌడ్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అదే కంపెనీలో టెరా సాఫ్ట్‌ యజమాని తుమ్మల గోపీచంద్‌ భార్య పావనీదేవి కూడా డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. ఇక టెండర్ల కమిటీ సమావేశంలో ఏపీటీఎస్‌ చైర్మన్‌ సుందరం టెరా సాఫ్ట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ వాటిని బేఖాతరు చేస్తూ వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ నిర్ణయంతో టెరాసాఫ్ట్‌ కంపెనీకి ఫైబర్‌ నెట్‌ టెండర్లను కట్టబెట్టారు. 

నాసిరకం పరికరాలతో రూ.119.98 కోట్ల నష్టం
ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌కు టెరాసాఫ్ట్‌ సరఫరా చేసిన పరికరాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. టెండర్‌  నిబంధనలను పాటించకపోయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేశారు. ఒప్పందం మేరకు పరికరాలు సరఫరా చేయకపోవడం, నాసిరకం, నాణ్యతా పరీక్షలు నిర్వహించకుండా బిల్లుల చెల్లింపు, నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవడం తదితరాల వల్ల ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌కు రూ.119.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ విచారణలో నిగ్గు తేల్చింది. 

బ్లాక్‌ లిస్టు నుంచి టెరాసాఫ్ట్‌ తొలగింపు...
పౌరసరఫరాల శాఖకు అంతకుముందు టెరా సాఫ్ట్‌ సరఫరా చేసిన ఇ–పీవోఎస్‌(ఇ–పోస్‌) పరికరాలు నాసిరకంగా ఉండటంతో ఆ కంపెనీని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) బ్లాక్‌ లిస్టులో చేర్చింది. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండా ఏడాదిపాటు నిషేధిస్తూ 2015 మే 11న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ నిషేధాన్ని ఏపీటీఎస్‌ కేవలం నాలుగు నెలల్లోనే ఆగస్టు 6న తొలగించడం గమనార్హం. అందుకోసం ఏపీటీఎస్‌ టెక్నికల్‌ కమిటీ ఆగమేఘాల మీద అదే రోజు సమావేశమైంది. ఏపీటీఎస్‌ ఎండీ బి.సుందర్‌ ఆ సమావేశం మినిట్స్‌లో సంతకం చేయకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెరాసాఫ్ట్‌పై నిషేధం తొలగింపును ఆయన వ్యతిరేకించారు. కానీ కమిటీలో సభ్యులైన ఐటీ శాఖ కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, ఆర్థిక శాఖలోని ఐటీ విభాగం డైరెక్టర్‌లు టెరా సాఫ్ట్‌పై నిషేధాన్ని తొలగించాలని నిర్ణయించడంతో టీడీపీ ప్రభుత్వ పెద్దల పన్నాగం సాఫీగా సాగిపోయింది. ఫైబర్‌ నెట్‌ టెండర్ల బిడ్‌ దాఖలుకు 2015 ఆగస్టు 7 చివరి తేదీ కాగా టెరా సాఫ్ట్‌ కంపెనీని ఒక  రోజు ముందు అంటే ఆగస్టు 6న బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు