భారీగా వడగళ్ల వాన

2 May, 2022 23:00 IST|Sakshi
పాడేరులో కురుస్తున్న వడగళ్ల వాన, పెద్ద సైజులో పడిన వడగళ్లు 

సాక్షి, పాడేరు: జిల్లాలో పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, డుంబ్రిగుడ, పెదబయలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు, వడగళ్లతో  భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా కాసింది,  మధ్యాహ్నం 12గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పాడేరు, హుకుంపేట ప్రాంతాల్లో సుమారు రెండు గంటల పాటు వర్షం కురిసింది.

భారీ సైజులో వడగళ్లు పడ్డాయి.  పాడేరు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడంతో  స్థానికులు తమ సెల్‌ కెమెరాల్లో బంధించి, సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశారు.  వడగళ్లను సేకరించేందుకు పిల్లలు పోటీపడ్డారు. పాడేరు ఘాట్‌రోడ్డులో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది.   

కొయ్యూరు: మండలంలో సుమారు గంట పాటు పెద్ద శబ్దాలు, తీవ్రమైన కాంతితో ఉరుములు, మెరుపులు రావడంతో పాటు పిడుగులు పడడంతో  ప్రజలు తీవ్ర భయందోళనకు గురయ్యారు.   

మరిన్ని వార్తలు