ఆవర్తనం ప్రభావంతో. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు

14 Jul, 2021 03:42 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, దీనికి అనుబంధంగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం మధ్యస్త ట్రోపోస్ఫియరిక్‌ స్థాయి వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని, తూర్పు–పశ్చిమ షియర్‌ జోన్‌ వెంబడి సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని వెల్లడించింది. ఈ ప్రభావం వల్ల ఉత్తర, దక్షిణ కోస్తాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో అత్యధికంగా 88.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు