తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

18 Oct, 2020 03:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ  కేంద్రం వెల్లడించింది. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న  మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది బలపడి తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

వదలని వాన
గడచిన 24 గంటల్లో బొండపల్లి, కారంచేడులో 8 సెం.మీ., డెంకాడలో 7, గుడివాడ, కుక్కునూరులో 6, పాలకోడేరులో 5, చిత్తూరు, అనకాపల్లి, పోలవరం, రేపల్లె, నర్సీపట్నం, గజపతినగరంలో 5, పాలసముద్రం, పుంగనూరు, నగరి, నూజివీడు, నెల్లిమర్ల, విజయనగరం, వరరామచంద్రాపురం, కూనవరం, తుని, రాజమండ్రి, పొదిలి, గుంటూరు, చింతపల్లిలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా