వాయు'గండం'

13 Oct, 2020 03:19 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ శివారు సుబ్బంపేట వద్ద ఉధృతంగా సముద్ర కెరటాలు

నేడు కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం 

గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు 

అల్లకల్లోలంగా సముద్రం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక 

రాష్ట్రమంతా నేడు వర్షాలు.. కోస్తాంధ్రకు భారీవర్ష సూచన 

సాక్షి, నెట్‌వర్క్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి సోమవారం ఉదయం 11.30 గంటలకు తీవ్ర వాయుగుండంగా మారింది. రాత్రి 9 గంటలకు విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 220 కి.మీ, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 240 కి.మీ, నర్సాపురానికి తూర్పు ఆగ్నేయ దిశగా 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 6 కిమీ వేగంతో ప్రయాణం చేస్తూ కాకినాడకు అతి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది.

ఆ సమయంలో కోస్తాంధ్రలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని తాకవచ్చని తెలిపింది. దీని ప్రభావంవల్ల మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. అందువల్ల మంగళవారం మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. పలు పోర్టుల్లో మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఉత్తర అండమాన్‌ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. 

కొనసాగుతున్న వర్షాలు 
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. కాకినాడ తీరంలో సోమవారం రాత్రి నుంచి గాలులు మొదలయ్యాయి. వర్షం కూడా పెరిగింది. కోనసీమలో అధికారులు ముందస్తుగా 41 తుపాను షెల్టర్లలో పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాకినాడ– ఉప్పాడ బీచ్‌ రోడ్డు పలుచోట్ల కోతకు గురయ్యింది. ప్రభుత్వ హెచ్చరికలతో మత్స్యకారులు వేటను నిలిపేశారు. కాకినాడలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 350 మందిని తరలించారు.  

సురక్షిత ప్రాంతాలకు నౌకలు 
కాకినాడ యాంకరేజ్‌ పోర్టు, డీప్‌ వాటరు పోర్టుల్లో ఎగుమతి, దిగుమతి పనులు నిలిచిపోయాయి. ఏపీ మెరైన్‌ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు యాంకరేజ్‌ పోర్టులో ఉన్న 13 అంతర్జాతీయ నౌకలను సముద్రంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాంకరేజ్‌ పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిపేసినట్లు పోర్టు అధికారి జి.వీరరాఘవరావు తెలిపారు. డీప్‌ వాటర్‌ పోర్టు (కాకినాడ సీ పోర్టు)లో చక్కెర, ఎరువుల ఎగుమతి, దిగుమతుల్ని నిలిపేసినట్లు సీపోర్టు అధికారి మురళీధర్‌ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదీ తీరప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో లంకలు, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. విశాఖపట్నం జిల్లాలో భారీవర్షం కురిసింది. విజయనగరం, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అల్పపీడనం, వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలు ఎనిమిది జిల్లాల్లో సుమారు 12,473 హెక్టార్లలో పంటలపై ప్రభావం చూపినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.  

గడిచిన 24 గంటల్లో భీమిలిలో 17 సెంమీ, విశాఖపట్నం 15, కాకినాడ, పెద్దాపురంలో 14, యానాంలో 11, అనకాపల్లి, అమలాపురంలో 10, మర్రిపూడి, తునిలో 8, సింహాద్రిపురం, ప్రత్తిపాడు, యలమంచిలిలో 7 సెంమీ, చీమకుర్తి, నర్సీపట్నం, చోడవరం, ఒంగోలు, పాలకోడేరులో 5 సెంమీ వర్షపాతం నమోదైంది. 

అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ 
భారీ వర్షాల వల్ల అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రజలకు తక్షణం సేవలందించేందుకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలోని పోలీసులను డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. ఈ విషయమై సోమవారం రాత్రి ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌వోల) నుంచి జిల్లా ఎస్పీలు, నగర పోలీస్‌ కమీషనర్ల వరకు 24 గంటలూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు డయల్‌ 100,  డయల్‌ 112కు సమాచారం ఇచ్చి పోలీసుల సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు