రేపు అల్పపీడనం.. భారీ వర్షసూచన

5 Sep, 2021 03:29 IST|Sakshi

నేడు కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన 

రేపు వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం 

సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లోను.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాజమండ్రిలో 7.2 సెం.మీ., అంబాజీపేటలో 7, ఎల్‌.ఎన్‌. పేటలో 6.7, తణుకులో 6.3, మచిలీపట్నంలో 6.1, మండపేటలో 5.9, అనపర్తి, పెడనలో 5.9, మచిలీపట్నంలో 5.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.   

మరిన్ని వార్తలు