కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

8 Jul, 2021 04:18 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బిహార్‌పై ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఒడిశా, ఉత్తర కోస్తా వరకూ విస్తరించింది. ఇది సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు ఈ నెల 11న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వరకూ.. గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులపాటు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. జంగారెడ్డిగూడెంలో 13.5 సెం.మీ., పెదపూడిలో 12.5, కాకినాడలో 10.3, ముండ్లమూరులో 10 సెం.మీ. భారీ వర్షపాతం నమోదవగా.. ఉలవపాడులో 9.6, సింగరాయకొండ, అద్దంకిలో 8.6, గోపాలపురం, కందుకూరులో 8.5, జగ్గంపేటలో 8.1, దేవరపల్లి 7.7, రాజాంలో 7.3, పిఠాపురంలో 7.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు