ఉత్తర కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన 

8 Oct, 2020 05:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్‌ సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని పేర్కొంది. 11వ తేదీ సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య వాయుగుండం తీరం దాటే సూచనలున్నాయని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులెవ్వరూ ఆంధ్ర, ఒడిశా తీరం వెంబడి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటల్లో గుడివాడలో 11 సెం.మీ, కైకలూరులో 9, విజయవాడ, పాలేరు బ్రిడ్జిలో 8, గుంటూరు, వేలేరుపాడులో 6, నందిగామ, మంగళగిరిలో 5, భీమడోలు, అవనిగడ్డ, లామ్, విశాఖపట్నంలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు