ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

14 Jun, 2021 04:04 IST|Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం, నైరుతి రుతుపవనాలతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కదలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

వీటికితోడు నైరుతి రుతుపవనాల విస్తరణతో రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు.   

మరిన్ని వార్తలు