వణికిస్తున్న వరుణుడు

21 Oct, 2020 03:28 IST|Sakshi

ఉత్తరాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం

సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో ఇది వాయవ్య దిశగా పయనించి.. 3 రోజుల తర్వాత దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.

అల్పపీడన ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. సముద్రం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అవనిగడ్డ, తణుకు 6 సెం.మీ., అమలాపురం, ఏలూరు, బొబ్బిలి, మంగళగిరి, తునిలో 5సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు