కోస్తాకు రేపు భారీ వర్ష సూచన

11 Jul, 2021 02:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీర ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు తేమను తీసుకువస్తోంది. దీనికితోడుగా ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 2.1 నుంచి 3.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది క్రమంగా ఛత్తీస్‌గఢ్‌ వైపు పయనించనుందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.

సోమవారం శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. ఈ నెల 13 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లోనూ అనకాపల్లిలో 6.7 సెం.మీ., మధురవాడలో 6.6, సూళ్లూరుపేటలో 6, కోటనందూరులో 5.7, పరవాడలో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు