తీరం దాటినా.. తుపాన్‌గానే..

3 Dec, 2020 03:29 IST|Sakshi

తుపాన్‌గా తీరం దాటి బలహీనపడనున్న బురేవీ

నేడు, రేపు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

సాక్షి, విశాఖపట్నం: తీరం దాటుతుంది.. మళ్లీ సముద్రంలోకి ప్రవేశించి.. తుపాన్‌గా కొనసాగుతుంది.. ఆ తర్వాత మరోసారి తీరం దాటి బలహీనపడుతుంది. ఇదీ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న బురేవీ తుపాన్‌ స్వరూపం. తీవ్ర వాయుగుండం బలపడి బుధవారం ఉదయం 8.30 గంటలకు తుపాన్‌గా మారిన బురేవీ.. ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమలైకు తూర్పుదిశగా 170 కిమీ, తమిళనాడులోని పాంబన్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 390 కిమీ, కన్యాకుమారికి తూర్పు ఈశాన్య దిశగా 560 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ.. శ్రీలంకకు సమీపంలో ట్రింకోమలైకి దగ్గర్లో శుక్రవారం సాయంత్రం గానీ, రాత్రికి గానీ తీరం దాటే అవకాశం ఉంది. అనంతరం.. ఇది పశ్చిమ దిశగా పయనించి.. మరోసారి సముద్రంలోకి తుపాన్‌గా ప్రవేశిస్తుంది.

ఆ తర్వాత నైరుతి దిశగా పయనిస్తూ తమిళనాడులోని పాంబన్‌– కన్యాకుమారి మధ్య 3వ తేదీ రాత్రి గానీ, 4వ తేదీ ఉదయం గానీ బురేవీ తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందనీ, అత్యధికంగా మేఘాల్ని తోడుకుపోవడంతో... దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల బురేవీ ప్రభావం స్వల్పంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. 3, 4 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.  

మరిన్ని వార్తలు