5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు

22 Jul, 2021 03:20 IST|Sakshi

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఈ స్థాయి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకూ కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు.

వచ్చే 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వీటి ప్రభావం వల్లే భారీ వర్షాలు కురుస్తున్నాయని.. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఇలాగే వర్షాలు పడతాయని వివరించారు. అల్పపీడన ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. 25వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి గరిష్టంగా 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. 

రాష్ట్రమంతటా కురిసిన వర్షాలు
మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే తూర్పు గోదావరి జిల్లా చింతూరులో అత్యధికంగా 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని వరరామచంద్రపురం, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో 7, కొత్తపల్లిలో 5.4, ఆత్మకూరులో 5.3, విజయనగరం జిల్లా తెర్లాం, బొండపల్లి, మెరకముడిదం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, రణస్థలంలలో 5, కృష్ణా జిల్లా గన్నవరంలో 3.4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో 1 నుంచి 4 సెం.మీ. వర్షం కురిసింది.  

మరిన్ని వార్తలు