ఏపీ: ముంచెత్తుతున్న భారీ వర్షాలు

26 Sep, 2020 13:56 IST|Sakshi

ఎడతెరిపిలేని వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు

పంటలకు కూడా భారీ నష్టం

కర్నూలు జిల్లా పాలేరు వాగు వంతెనపై  ప్రవహిస్తున్న వరద నీరు

మహానంది - గాజులపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం

సాక్షి, కర్నూలు/ప్రకాశం/గుంటూరు: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లుతోంది. వాగులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కర్నూలు జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా బండి ఆత్మకూరు మండలం లో 180.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మహానంది - గాజులపల్లి మధ్య పాలేరు వాగు వంతెనపై నుండి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల - భీమవరం మధ్య వక్కిలేరు వాగు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గడివేముల మండలం కోరటమద్ది వద్ద వాగు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వైఎస్సార్‌ జిల్లా: పెద్దముడియం మండలంలో కుందూ ప్రవాహం పెరుగుతుంది. లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు. నెమలిదిన్నె, బలపనగుడూరు, చిన్నముడియం, సిరిపాల దిన్నే, గర్శలూరు, ఉప్పలురు, పెద్దముడియం గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. పోరుమామిళ్ళ, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. పోరుమామిళ్ళ మండలంలో నాగలకుంట్ల, బూరగమానుపల్లె చెరువులు పూర్తిగా నిండుకున్నాయి. గోపవరం మండలం మడకల వారిపల్లె రాచెరువుకు భారీగా వర్షపు నీరు చేరింది. ఐదేళ్ల తర్వాత చెరువుకు నీరు చేరడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లా: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రొంపిచర్ల మండలం మునమాక, తుంగపాడు వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నరసరావుపేట వైపు రాకపోకలు బంద్‌ అయ్యాయి.  తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు పొంగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.

ప్రకాశం జిల్లా: నాగులుప్పలపాడు మండలం చదలవాడ చెరువుకు గండి పడటంతో చీరాల - ఒంగోలు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో  శ్రీనివాస థియేటర్ వద్ద ఇళ్ల లోకి చేరిన వరద నీరు చేరడంతో ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. రాచెర్ల మండలంలో గుండ్లకమ్మ ఉగ్రరూప దాల్చింది. గిద్దలూరు-ఆకవీడుకు రాకపోకలు బంద్ అయ్యాయి. బెస్తవారిపేట మండలంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. బాసినేపల్లి వద్ద వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అనంతపురం జిల్లా: జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో కుండపోత వర్షం పడుతుంది. డోనేకల్ వాగు పొంగిపొర్లడంతో గుంతకల్లు-బళ్లారి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తూర్పుగోదావరి: ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి వరద నీరువచ్చి చేరుతుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుండి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద కూడా వరద నీటిమట్టం 5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కు మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాల ప్రభావం పెద్దగా లేకపోయినా గోదావరి కాస్త పెరిగితే లంక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే ఐదు లక్షల క్యూసెక్కుల కు మించి వరదనీరు పెద్దగా వచ్చే అవకాశం లేదని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా