విస్తృతంగా వర్షాలు... 11 నుంచి మళ్లీ వడగాడ్పులు

6 May, 2023 06:06 IST|Sakshi

కొనసాగుతున్న ఆవర్తనం

నేడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపు అల్పపీడనం

ఆపై వాయుగుండం, తుపానుగా మార్పు

బంగ్లాదేశ్, మయన్మార్‌ల వైపు పయనించే అవకాశం

11 తర్వాత నుంచి మళ్లీ వడగాడ్పులు 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర­వ్యాప్తంగా శుక్రవారం కూడా వర్షాలు విస్తృతంగా కురిశాయి. పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా కవురులో 8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో 7.5, బాపట్ల జిల్లా లోవలో 6.6, తిరుపతి జిల్లా చిలమన్నూరులో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు ఏపీఎస్‌డీపీఎస్‌ డైరెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు.

దక్షిణ అంతర్గత కర్ణాటక, దానికి ఆను­కుని ఉన్న తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో నాలుగైదు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం రాత్రి వెల్లడించింది.

ఇక శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్న­మయ్య, వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముంది. 

నేడు ఉపరితల ఆవర్తనం..
మరోవైపు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో శని­వారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశము­న్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 7వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా, 8వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు  అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఉత్తర దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుపాను బంగ్లాదేశ్, మయన్మార్‌ తీరాల దిశగా వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండే అవకాశంలేదని వాతావరణ శాఖ తెలిపింది.

కానీ, అల్పపీడనం, వాయుగుండం ప్రభావం మాత్రం ఉండవచ్చని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, వేటకు వెళ్లిన వారు శనివారంలోగా తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తమ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు ఆయన వివరించారు. అత్యవసర సాయం, సమాచారం కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101కు ఫోన్‌చేయాలని సూచించారు. 

11 నుంచి మళ్లీ వడగాడ్పులు
ఇక రాష్ట్రంలో ఈనెల 10 వరకు సాధారణ లేదా అంతకంటే తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తుపాను బలహీనపడిన తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో ఈనెల 11వ తేదీ తర్వాత నుంచి పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఉధృతమవుతూ కోస్తాంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.)   

మరిన్ని వార్తలు