Andhra Pradesh : వదలని వాన

23 Jul, 2021 02:23 IST|Sakshi
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం దాసయ్యపాలెం వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

కోనసీమలో కుండపోత.. పొంగుతున్న వాగులు

లోతట్టు ప్రాంతాలు జలమయం

యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సహాయక చర్యలకు సీఎం ఆదేశం

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రమంతటా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కుండపోత వర్షాలు పడ్డాయి. అమలాపురంలో అత్యధికంగా 11 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలుచోట్ల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. దీనివల్ల విద్యుత్‌ వైర్లు తెగి పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలకోడేరు, తాడేపల్లిగూడెం, భీమవరంలలో 9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం వద్ద జల్లేరు, బుట్టాయగూడెం మండలం కేఆర్‌ పురం వద్ద వాగులు పొంగి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో వాగుల కల్వర్టుల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కృష్ణా జిల్లాలో వైరా, కట్టలేరు, నల్లవాగు, మున్నేరు, వెదుళ్లవాగు.. లక్ష్మయ్య వాగు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కోతకు గురవడంతో అక్కడక్కడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. గుంటూరు నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉమెన్స్‌ కాలేజీ వద్ద చెట్టు కూలడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థిని గాయపడింది. రొంపిచర్ల మండలంలోని ఓగేరువాగు, నక్కలవాగు, గాడిదలవాడు, ఊరవాగు, కొండవాగు, ఏడు గడియలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, లో లెవెల్‌ చప్టాలపై వాహన రాకపోకలు నిలిపివేపి పోలీస్, రెవెన్యూ సిబ్బంది పహారా కాస్తున్నారు.

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట, త్రిపురాంతకం మండలం రామచంద్రాపురంలో వర్షాలకు నానిన పాత ఇళ్లు కూలిపోయాయి. నెల్లూరు జిల్లాలో తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. : కర్నూలు జిల్లాలోని మహానంది–గాజులపల్లె రహదారి మధ్య గల పాలేరువాగు పొంగటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ కొండపై పెనుగాలులు వీచాయి. సందర్శకులు ఆందోళనకు గురై గదుల్లోకి పరుగులు తీశారు. ఓ చెట్టు విరిగి పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలపై పడింది. విద్యుత్‌ తీగలు తెగి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో గురువారం సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. 

యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం
వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలకు ఆదేశాలిచ్చింది. కూలిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్‌ తీగలు తెగిన చోట యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, ఇరిగేషన్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.

నేడు, రేపు చెదురుమదురు వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఇది శుక్రవారం ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో శుక్రవారం నుంచి క్రమంగా భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటిన తర్వాత అల్పపీడనం విదర్భ ప్రాంతం వైపు ప్రయాణిస్తుందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రం వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించింది. శుక్రవారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. రెండు రోజులపాటు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. 

అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్లకు సీఎం ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం కాపు నేస్తం పథకం అమలు వర్చువల్‌ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్లకు సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. వివిధ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి తగిన సహాయ  చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.  

మరిన్ని వార్తలు