నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు

29 Aug, 2021 05:18 IST|Sakshi

ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం

తీరం వెంట 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

సాక్షి, విశాఖపట్నం/సాక్షి,అమరావతి/టెక్కలి: దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు అల్పపీడనం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో రుతుపవన ద్రోణి ఏపీ వైపు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, వైఎస్సార్‌ కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.

రాష్ట్రంలో మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయి. సోమవారం ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం తీరం వెంట గంటకు 40 నుంచి 50 కి.మీ, గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తీరం అల్లకల్లోలంగా మారనుందని, మత్స్యకారులెవరూ రాగల 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రుతుపవన ద్రోణి మరింత బలపడి మరో నాలుగు రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. ఇది క్రమంగా విదర్భ వైపు ప్రయాణించనుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిశాయి. యలమంచిలిలో 6.7 సెం.మీ, నాగాయలంకలో 5.9, అనకాపల్లిలో 5.3, కశింకోటలో 5.2, పరవాడలో 4.6, తవనంపల్లి, బెల్లంకొండలో 4.3, నందిగామ, తాడికొండలో 4.1, చిత్తూరులో 3.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

గెడ్డలో కొట్టుకుపోయి రైతు దుర్మరణం
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం పంచాయతీ వింజాంపాడుకు చెందిన రైతు బగాది అప్పన్న (60) గ్రామ సమీపంలోని గరీబులగెడ్డలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం పొలానికి వెళ్లిన అప్పన్న మళ్లీ చీకటి పడే సమయానికి గెడ్డలో దిగి తిరిగివస్తుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయాడు. రాత్రి అవుతున్నా అప్పన్న ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరగా శనివారం గోదావరిపేట సమీపంలో గెడ్డ వద్ద అప్పన్న మృతదేహం లభ్యమైంది. కాగా, గెడ్డలో అధికంగా గుర్రపు డెక్క పేరుకుపోవడంతో ఒక్కసారిగా నీటి ఉధృతికి అప్పన్న తప్పించుకోలేకపోయాడని గ్రామస్తులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు