కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

12 Oct, 2020 03:10 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ వద్ద సముద్రపు అలల ఉధృతికి కోతకు గురవుతున్న తీరం

నేడు నర్సాపురం–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం

మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు 

వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక

పోర్టుల్లో మూడో నంబర్‌ హెచ్చరిక జారీ

ఈ నెల 14న మరో అల్పపీడనం

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వేకువ జామున 5.30 గంటలకు వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఆదివారం రాత్రి 9 గంటలకు విశాఖపట్నంకు పశ్చిమ ఆగ్నేయ దిశగా 330 కి.మీ, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 370 కి.మీ, నర్సాపురానికి తూర్పు ఆగ్నేయ దిశగా 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది నర్సాపురం, విశాఖపట్నం మధ్య సోమవారం రాత్రి తీరం దాటే అవకాశముందని ఇక్కడి భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. దీనికి తోడుగా.. ఉత్తర అండమాన్‌ సముద్రం.. దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు తెలిపింది.

ఇక తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది. తీర ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయుగుండంగా తీరం దాటనున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు.

మత్స్యకారులకు హెచ్చరిక
తీవ్ర వాయుగుండం కారణంగా రాగల రెండ్రోజులపాటు మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఇందుకు సంబంధించి కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్‌ హెచ్చరిక జారీచేశారు. 

మరిన్ని వార్తలు