మాండూస్‌ ఎఫెక్ట్‌: కుండపోత వర్షాలు.. ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం

11 Dec, 2022 02:13 IST|Sakshi

నెల్లూరు, తిరుపతి జిల్లాలపై మాండూస్‌ తీవ్ర ప్రభావం 

తీవ్రమైన ఈదురు గాలులు.. విరిగిపడిన చెట్లు

పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు..

పలు ప్రాంతాల్లో రాకపోకలు బంద్‌.. జలాశయాల నుంచి నీటి విడుదల

నాయుడుపేటలో ఏకంగా 28 సెంటీమీటర్ల వర్షం 

తిరుపతి, పరిసర ప్రాంతాల్లో మోకాలిలోతు వరద నీటి ప్రవాహం

శుక్రవారం అర్ధరాత్రి తీరం దాటిన తుపాను

సోమవారం వరకు వర్షాలు కురిసే అవకాశం 

ముందే అప్రమత్తమైన ప్రభుత్వం.. కొనసాగుతున్న సహాయక చర్యలు 

33 సహాయక శిబిరాలు.. 708 మంది తరలింపు 

Cyclone Mandous Andhra Pradesh Updates

ప్రకాశం జిల్లా:
సముద్రంలో చిక్కుకున్న 7 గురు మత్స్యకారులు కొత్తపట్నం వద్ద సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ నెల 4 తేదీన చీరాల ఓడరేవు మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లారు. తుపాను ఉధృతికి సముద్రంలొనే చిక్కుకుపోయారు. జిల్లాలో  రాత్రంతా ఎడతెరిపిలేని వర్షం కురవగా, ఈ రోజు ఉదయం నుండి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బైరవకొన జలపాతం ఉరకలేస్తుంది. భారీ వర్షాలతో శనగ, పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారు.

తిరుపతి:  పోటెత్తిన వరద నీరు
స్వర్ణముఖి నదికి వరద నీరు పోటెత్తింది. ఏర్పేడు మండలం పాపానాయుడు పేట వద్ద స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో నదికి అవతల వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మల్లేమడుగు రిజర్వాయర్ 12 గేట్లను ఎత్తివేసి స్వర్ణ ముఖి నదిలో దిగువకు నీరు విడుదల చేశారు.

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: మాండూస్‌ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండ­పో­తగా.. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతు­న్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత, భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్ట­ణాలు, గ్రామాల్లో వర్షపు నీరు మోకాలి లోతున ప్రవ­హి­స్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి­పడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతు­న్నాయి.

తిరుపతి, తిరుమలలో జనజీవనం స్తంభించింది. తిరుపతి జిల్లాలో నాయుడుపేట, బాలా­యపల్లె, ఓజిలి, శ్రీకాళహస్తి, తొట్టెంబేడు, తిరుపతి, వాకాడు, చిల్లకూరు, నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు, ఆత్మకూరు, కలువోయ, అనంతసాగరం, మర్రిపాడు, అనుమసముద్రంపేట, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, తదితర ప్రాంతాల్లో జనం పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. తుపాను ప్రభావంతో రాష్ట్రమంతటా చలి గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్టలో కే పద్మావతి అనే మహిళ మృతి చెందింది. 

సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లో ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి అధికార యంత్రాంగం 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 33 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి పూర్తి స్థాయిలో ఆహారపు ప్యాకెట్లు, వాటర్‌ ప్యాకెట్లు అందించారు. ఆయా జిల్లాల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్, 5 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. లోతట్లు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో ఈ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కండలేరు, మానేరు, స్వర్ణముఖి నదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నదీ తీర ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. 

వాయుగుండంగా బలహీనపడిన తుపాను
మాండూస్‌ తుపాను శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత తమిళనాడులోని వెల్లూరు వైపు కదులుతూ తీవ్ర వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడింది. రాబోయే కొద్ది గంటల్లో ఇది క్రమేపీ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో మన రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 

ముందు జాగ్రత్తతో తగ్గిన నష్టం తీవ్రత
మాండూస్‌ తుపాను అల్పపీడనంగా బలహీన పడినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. స్టేట్‌ ఎమర్జన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నాం. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలు ఇస్తున్నాం. అధికార యంత్రాంగం 24 గంటలు పని చేస్తూ సత్వరమే స్పందించేలా ఏర్పాట్లు చేశాం. ప్రమాదాలను స్పష్టంగా అంచనా వేస్తూ.. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అందువల్లే నష్ట తీవ్రతను బాగా తగ్గించ గలిగాం. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించాం. 
– జి సాయిప్రసాద్, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి


శుక్రవారం ఉ.8.30 గంటల నుంచి శనివారం ఉ.8.30 వరకు వర్షపాతం
ప్రదేశం                         సెంటీమీటర్లలో 
నాయుడుపేట, తిరుపతి జిల్లా            28.1 
హస్తకావేరి, తిరుపతి జిల్లా                24.1 
కట్టవపల్లె, నెల్లూరు జిల్లా                23.8 
అరిమనిపాడు, తిరుపతి జిల్లా            23.4
బ్రహ్మదేవం, నెల్లూరు జిల్లా            22.2
వెంకటాచలం, నెల్లూరు జిల్లా            21.5
శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా                21.3
పాలూరు, నెల్లూరు జిల్లా                21.2
విద్యానగర్, తిరుపతి జిల్లా            21
తొట్టెంబేడు, తిరుపతి జిల్లా            20.9

శనివారం ఉ.8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం
ప్రదేశం                         సెంటీమీటర్లలో 
భట్టేపాడు, నెల్లూరు జిల్లా                13.3
బల్లిపల్లి, ప్రకాశం జిల్లా                11.9
పెదచెర్లోపల్లి, ప్రకాశం జిల్లా            11.6
చీపినపి, నెల్లూరు జిల్లా                11.1
మోపిదేవి, కృష్ణా జిల్లా                9.4
ఆత్మకూరు, నెల్లూరు జిల్లా                8.9
రేవూరు, నెల్లూరు జిల్లా                8.8
వాసిలి, నెల్లూరు జిల్లా                8.8    
మర్రిపాడు, నెల్లూరు జిల్లా                8.4
పాకల, ప్రకాశం జిల్లా                8.2        

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని వదిలారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరుమలను పొగ మంచు చుట్టుముట్టింది. ఘాట్‌ రోడ్డులో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు స్తంభించాయి. అలిపిరి వద్ద భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. శ్రీవారిమెట్టు కాలినడక మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కెవీబీ పురం మండల పరిధిలోని కాళంగి రిజర్వాయర్‌ పూర్తిగా నిండిపోవటంతో 16 గేట్లు ఎత్తి నీటిని విడిచిపెట్టారు. ఫలితంగా 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరద ప్రవాహానికి పూడి, పోలినాయుడు కండ్రిగ, రాజులకండ్రిగ కాజ్‌ వే లు కొట్టుకుపోయాయి. పిచ్చాటూరు పరిధిలోని అరణియార్‌ రిజర్వాయర్, పెనుమూరు మండల పరిధిలోని ఎన్టీఆర్‌ జలాశయానికి భారీగా నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. స్వర్ణముఖి, కుశస్థలి, నీవా, అరుణానది, కైవల్యా, కాళంగి, బహుదా, కౌండిన్య, గార్గేయ నదులు, గొడ్డేరు వాగు, పాములకాలువ, నేరేడు కాలువ, ఉప్పుటేరు, అలపలేరు వాగు, బడబళ్లు వాగు, ఏటి చెరువు, పెద్దేరు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను తీవ్రతకు జిల్లాలో పది పశువులు మృతి చెందాయి. వందకుపైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.
 
రైల్వేకోడూరు–తిరుపతి రహదారిపైకి వరద నీరు
అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల పరిధిలో సుమారు 20 గ్రామాలకుపైగా రాకపోకలు స్తంభించాయి. అరటి, బొప్పాయి తోటల్లోకి నీరు చేరింది. రైల్వేకోడూరు–తిరుపతి ప్రధాన రహదారిపై వరద నీరు పోటెత్తింది. నిమ్మనపల్లె వద్ద ఉన్న బాహుదా ప్రాజెక్టుతోపాటు గాలివీడు పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లాలోనూ పలు చోట్ల పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం డ్యామ్‌కు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మైలవరం డ్యామ్‌ నుంచి 3 వేల క్యూసెక్కులను పెన్నానదిలోకి వదిలారు. చిత్రవతి రిజర్వాయర్‌ నుంచి 2 గేట్లు ఎత్తి 2400 క్యాసెక్కుల నీటికి నదిలోకి వదులుతున్నారు.  

లోతట్టు ప్రాంతాలు జలమయం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా మనుబోలు మండలంలో 277 మి.మీ. వర్షం కురిసింది. బొగ్గేరు, పైడేరు, ఆల్తుర్తి, బీరాపేరులో నీటి ప్రవాహం పెరిగింది. సోమశిల ప్రాజెక్ట్‌కు వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో పొలా నీట మునిగాయి. నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, వైఎస్సార్‌ నగర్, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. 

– ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఐదు మండలాల పరిధిలో 57 గ్రామాల్లోని పొలాల్లో నీరు నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. జడివానకు తోడు ఈదురు గాలులు జనాన్ని వణికించాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు లాంటి శుభాకార్యాలు ఎక్కువగా ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా, రబీ సాగుకు ఈ వర్షాలు ఊరటనిస్తాయని చెబుతున్నారు.

రవాణాకు ఇబ్బంది కలగనివ్వం 
మాండూస్‌ తుపాను వల్ల వివిధ జిల్లాల్లో పంచాయతీరాజ్‌ రోడ్లకు జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను ఎప్పడికప్పుడు తెలియజేయాలని పీఆర్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ బాలునాయక్‌ ఆదేశించారు. శనివారం కర్నూలు వచ్చిన ఆయన స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని పీఆర్‌ ఎస్‌ఈ కార్యాలయం నుంచి చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్‌ఈలతో వెబె కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రజల రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. తుపాను తగ్గిన అనంతరం జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలను పంపాలన్నారు.  

ఏ ఒక్క రైతునూ నష్టపోనివ్వం : మంత్రి కారుమూరి 
తణుకు అర్బన్‌: మాండూస్‌ తుపాను కారణంగా పంట తడిసినా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే ఆఫ్‌లైన్‌ ద్వారా సేకరిస్తామని స్పష్టం చేశారు.  తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి గింజనూ సత్వరమే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే రైతాంగానికి అనుకూలంగా అధికారులకు ఆదేశాలిచ్చారని చెప్పారు. ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చూడాలనే తపనతో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. 

మరిన్ని వార్తలు