ఉత్తర కోస్తాపై ఉపరితల ద్రోణి.. నేడు, రేపు వర్షాలు

6 Jul, 2021 03:47 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా తీరం వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది.

దక్షిణ కోస్తా, రాయలసీమల్లో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది.  కర్నూలు జిల్లాలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో ఆమదాలవలసలో 8 సెం.మీ., గూడూరులో 7.1, సి.బెలగొలలో 6.2, కె.నాగులాపురంలో 5.2, తంబళ్లపల్లెలో 4.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.   

మరిన్ని వార్తలు