కురిస్తే కుండపోతే..మారుతున్న రుతుపవన సరళి

27 Jun, 2022 07:52 IST|Sakshi

తగ్గుతున్న వర్షం కురిసే రోజులు

పెరుగుతున్న వర్షపాతం, ఉష్ణ తాపం

ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే 5 శాతం పెరగనున్న వర్షపాతం

ఉధృతం కానున్న తేమ, గాలుల తీవ్రత

సాక్షి, విశాఖపట్నం: కొన్నేళ్లుగా వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోతోంది. దాని ప్రభావం రుతు పవనాలపై చూపుతోంది. అంతేకాదు.. వర్షపాతం, తేమ, గాలి దిశలపైనా ప్రభావం చూపిస్తోంది. వాయుగుండాలు, తుపానుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తక్కువ రోజుల్లోనే కుండపోత వర్షాలు కురవడం, గాలుల తీవ్రత పెరగడం వంటి అనూహ్య.. అసాధారణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ ఏడాది మే 14న పాకిస్తాన్‌లోని జకోబాబాద్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. భారత్‌ సహా పలు దేశాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు వీచాయి. మేఘాలయలోని చిరపుంజిలో ఈ నెల 17న 97 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. ఇది 122 ఏళ్ల చరిత్రలో మూడో అతి పెద్ద వర్షపాతంగా నమోదైంది. ఇలా అత్యధిక ఉష్ణోగ్రతలు, మరోపక్క అధిక వర్షాలు కురుస్తూ వాతావరణంలో భారీ మార్పులను స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రభావం మన దేశంలో రుతు పవనాలపైనా చూపుతూ వాటి సరళిలోను, గాలి దిశ మార్పునకు దోహదం చేస్తున్నాయి.  

భవిష్యత్‌లో భారీ వర్షాలే 
సాధారణంగా రుతు పవనాల సీజన్‌ మొత్తమ్మీద గాలుల దిశ ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు నైరుతి రుతుపవనాల సీజన్‌లో నైరుతి నుంచి, ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయి. కానీ.. వీటి గమనంలోనూ వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. అరేబియా సముద్రం నుంచి అనూహ్యంగా రుతు పవన గాలులు ఉధృతం కావడంతో అలలు ఎగసిపడుతూ తేమను సరఫరా చేయడం వల్ల భారీ వర్షాలకు కారణమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలతో రుతు పవన వర్షపాతం 5 శాతం వరకు పెరుగుతోందని, ఫలితంగా రానున్న సంవత్సరాల్లో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 

తగ్గుతున్న వాయుగుండాలు, అల్పపీడనాలు 
గతంలో నైరుతి రుతు పవనాల సీజన్‌లో (జూన్‌–సెప్టెంబర్‌) బంగాళాఖాతంలో 10నుంచి 12 వరకు వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడతాయి. కానీ.. అవి 3–4కి తగ్గిపోతున్నాయి. అయితే ఆకస్మికంగా ఏర్పడుతున్న అల్పపీడన/ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం అరుదైన పరిణామంగా చెబుతున్నారు. ఇక ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే  తుపానుల సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ.. వాటి తీవ్రత మాత్రం పెరుగుతూ అధిక వర్షపాతం కురుస్తున్నట్టు, తుపాను గాలుల తీవ్రత పెరిగినట్టు నిపుణులు గుర్తించారు. ఇది ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతోంది. మరోవైపు ప్రీ–మాన్‌సూన్‌ సీజన్‌గా పిలిచే నైరుతి రుతు పవనాలకు ముందు కాలం (ఏప్రిల్‌–మే)లో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో (థండర్‌ స్ట్రోమ్స్‌) అకాల వర్షాలు కురుస్తాయి. కొన్నాళ్లుగా వీటి సంఖ్య తగ్గినా వర్షం, గాలుల తీవ్రత మాత్రం పెరుగుతున్నట్టు గుర్తించారు.

వర్షం రోజులు తగ్గి.. ఉధృతి పెరిగి  
వాతావరణ మార్పుల ప్రభావం రుతు పవనాల సీజన్‌పై పడుతోందని ఇప్పటికే పలు క్‌లైమేట్‌ మోడల్స్‌ నిర్ధారించాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. 2025, 2030, 2035 సంవత్సరాలకు రుతు పవనాల సీజన్‌లో వర్షం కురిసే రోజులు తగ్గుతాయి. కానీ.. వర్షాల ఉధృతి మాత్రం పెరుగుతుంది. తేమ, గాలుల వేగం కూడా పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్‌లో భూమి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) లోతుగా అధ్యయనం చేస్తోంది.  
– ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్, పూర్వ అధిపతి, సముద్ర అధ్యయన విభాగం, ఆంధ్రా యూనివర్సిటీ

మరిన్ని వార్తలు