AP: ఈ నెలంతా వానలే

6 Oct, 2021 03:55 IST|Sakshi

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం  

నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ, ఈశాన్య రుతుపవనాల ఆగమనంతోపాటు తుపాన్ల కాలం సమీపిస్తుండటంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకోనున్నాయి. బుధవారం నుంచి వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలుకానుంది. మరోవైపు తమిళనాడు, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.

ఈ ఉపరితల ఆవర్తనం పైకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. సూళ్లూరుపేటలో 176.50 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా ఏర్పేడులో 139.5, ముత్తుకూరులో 133.25, బుచ్చినాయుడుకండ్రిలో 114.25, ఇందుకూరుపేటలో 99.25, తడలో 96, గూడూరులో 86.5, మనుబోలులో 79.5, చిల్లకూరులో 70.25, నెల్లూరులో 70, సత్యవేడులో 64.25, కొరుటూరులో 63, శ్రీకాళహస్తిలో 59.5, తొట్టంబేడులో 57.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు