కొనసాగుతున్న అల్పపీడనం

18 Aug, 2021 02:39 IST|Sakshi

నేడు కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ప్రస్తుతం ఒడిశా తీరానికి సమీపంలో ఛత్తీస్‌గఢ్‌ తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆనుకుని ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రాగల 24 గంటల్లో దిశను మార్చుకుని ఉత్తర దిశగా విదర్భ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు వరకూ ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. మరోవైపు.. అల్పపీడన ప్రభావంతో బుధవారం కోస్తా జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ వరకు గరిష్టంగా 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలున్నాయన్నారు.

మత్స్యకారులెవ్వరూ రాగల 48 గంటల వరకూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ముసునూరులో 58.5 మి.మీ, సూళ్లూరుపేటలో 55.2, చింతూరులో 52, లావేరులో 45.2, నర్సాపురంలో 40, పెడనలో 39, పాలకొండలో 34.5, రాయవరంలో 30.5, అనపర్తిలో 28.5, సీతంపేట 27.5 మి.మీ వర్షపాతం నమోదైంది.   

మరిన్ని వార్తలు