భారీ రైలు ప్రమాదం.. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు!!

10 Mar, 2021 04:15 IST|Sakshi
బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కిన దృశ్యం

గుంతకల్లు: ‘అనంతపురం జిల్లాలో భారీ రైలు ప్రమాదం! ఉదయం 10 గంటలకు గుంతకల్లు డివిజన్‌ పరిధిలోని కొండాపురం రైల్వే స్టేషన్‌లో దుర్ఘటన!! కంట్రోల్‌ రూమ్‌కు మెసేజ్‌.. అప్రమత్తమైన రైల్వే శాఖ.. ఏడీఆర్‌ఎం సూర్యనారాయణ, 10వ బెటాలియన్‌ ఎన్‌డీఎఫ్‌ఆర్‌ జవాన్లు హుటాహుటిన కొండాపురం రైల్వేస్టేషన్‌ చేరుకొని ప్రయాణికులను రక్షించి యుద్ధప్రాతిపదికన ఆస్పత్రికి తరలించారు..’ 

ఈ వార్త నిజమనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఈ తరహా ఊహించని ఘటనలు జరిగితే అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉన్నారో లేదో తెలుసుకొనేందుకు కొండాపురం రైల్వేస్టేషన్‌లో మంగళవారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అందులో భాగంగా నిజంగా ప్రమాదం సంభవిస్తే జరిగే ఆస్తి నష్టం, ప్రాణనష్టం నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

రెండు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కిన ఘటనలో ప్రయాణికులను ఎలా రక్షించాలి? సత్వర వైద్యసేవలకు తరలించే సన్నివేశాలను ప్రదర్శనల ద్వారా చూపించారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ రైలు ప్రమాదాలు జరిగినప్పుడు యుద్ధప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు