కోస్తాను ముంచెత్తిన వాన

14 Oct, 2020 02:36 IST|Sakshi
రాజధాని ప్రాంతంలో నదిని తలపిస్తున్న వర్షపు నీటి మధ్యలో ఉన్న ఏపీ హైకోర్టు (ఇన్‌సెట్‌లో) కాకినాడ వద్ద తీరందాటి తెలంగాణ వైపు ప్రయాణిస్తున్న వాయుగుండం రేఖా చిత్రం

తీరం దాటిన తీవ్ర వాయుగుండం

ఉభయగోదావరి జిల్లాల్లో కుండపోత

పొంగుతున్న వాగులు, వంకలు

వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి  

ఉరకలెత్తుతున్న గోదావరి, కృష్ణా

లోతట్టు ప్రాంతాలు జలమయం

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

నీటమునిగిన పంటలు

కృష్ణా కరకట్ట వద్ద ఇళ్లలోకి నీరు

కోస్తా, రాయలసీమల్లో నేడు మోస్తరు వర్షాలు

సాక్షి, అమరావతి: రెండు రోజులుగా కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ నగరాల్లో లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. నగరాల్లోని అనేక అపార్టుమెంట్లలోకి నీరు చేరింది. వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉధృత రూపం దాల్చింది. కృష్ణా కరకట్టపై ఉన్న ఇళ్లలోకి నీరు వస్తోందని, ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురికి హెచ్చరికలు జారీ చేశారు. 

వాగుల్లా మారిన రహదారులు
– భారీ వర్షాలతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం వాగులను తలపిస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
– విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరంలోని ఉప్పులేరు పొంగడంతో పడవలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని గోస్తని, శారదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 
– భారీ వర్షాలు, గాలులతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. కోత, పొట్టదశలో ఉన్న వరి నీట మునిగింది. భారీ గాలుల వల్ల కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. రహదారులు, చెరువు గట్లకు గండ్లు పడ్డాయి. వందలాది పూరిళ్లు కూలిపోయాయి.  

సురక్షిత ప్రాంతాలకు తరలింపు
– వరద ప్రభావిత జిల్లాల కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మందులు, నిత్యావసర వస్తువులను అవసరమైన మేరకు నిల్వ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.
– రహదారులు, కాలువలు, వంతెనలకు గండ్లు పడి రవాణాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని ఆదేశించారు.
– ఎక్కడకు కావాలంటే అక్కడికి సహాయ కార్యక్రమాల కోసం తరలించడానికి వీలుగా విశాఖపట్నం జిల్లాలో మూడు జాతీయ విపత్తు సహాయక దళాలను (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిద్ధంగా ఉంచారు. కాకినాడలో ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. 
– సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 129 మండలాల్లో 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. 

కలెక్టరేట్లలో 24 గంటలూ కంట్రోల్‌ రూమ్‌లు
– వరద ప్రభావిత జిల్లాల్లోని కలెక్టరేట్లలో రౌండ్‌ ద క్లాక్‌ కంట్రోల్‌ రూమ్‌లు పని చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించారు. 
– నిత్యం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా పంపాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో జలవనరులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 327 బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ఆ శాఖ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది.

తీరం దాటిన తీవ్ర వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం – నర్సాపూర్‌ మధ్య కాకినాడకు 30 కి.మీ దూరంలోని నేమం ప్రాంతంలో  తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 6.30 – 7.30 గంటల మధ్య తీరం దాటింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలివేగం ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ట స్థాయికి చేరిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం రాత్రి  పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది. అయితే.. వాయుగుండం ప్రభావం సముద్రంపై ఇంకా కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం కోస్తా తీరంలో సముద్రం అలలు 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే ప్రమాదం ఉండటంతో పర్యాటకులు, మత్స్యకారులు తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు