వైఎస్సార్‌ చేయూతతో పల్లెల్లో ‘క్షీర విప్లవం’

6 Aug, 2021 10:40 IST|Sakshi

వైఎస్సార్‌ చేయూత కింద  మహిళలకు పాడి పశువులు, జీవాల యూనిట్ల మంజూరు

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అడుగులు

ఇప్పటివరకు 2,245 పాడి, 1004 గొర్రెల యూనిట్ల అందజేత

విజయనగరం ఫోర్ట్‌: పాడి పశువులు పెంచే వారి ఇల్లు పది కాలాల పాటు పచ్చగా ఉంటుందన్నది పెద్దల నానుడి. గ్రామీణ ప్రజలు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేది పశుసంపదే అని గట్టిగా నమ్ముతారు. దీనిని గుర్తించిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత కింద మహిళలకు పాడి, జీవాల యూనిట్లను మంజూరు చేస్తోంది. మహిళల ఆర్థిక ప్రగతికి ఊతమిస్తోంది. రైతుల ఇళ్లు పాడి పశువులు, జీవాలతో కళకళలాడేలా యూనిట్లు మంజూరు చేస్తోంది.

ప్రభుత్వం అందించిన ‘చేయూత’ ఇలా...  
వైఎస్సార్‌ చేయూత పథకం కింద రూ.75 వేల విలువ చేసే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఆవు లేదా గేదె అయితే  ఒకటి, 8 ఆడగొర్రెలు, ఒక  గొర్రెపోతు, 8 మేకలు, ఒక మేకపోతును యూనిట్‌గా సమకూర్చుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,245 ఆవులు, గేదెలు యూనిట్లు అందజేసింది. దీనికోసం ప్రభుత్వం రూ.16.83 కోట్లు ఖర్చుచేసింది. రూ.7.53 కోట్ల విలువైన 1004 గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేసింది.

పెరగనున్న పాల ఉత్పత్తి...  
ప్రస్తుతం జిల్లాలో పాలిచ్చే ఆవులు 2,28,773, గేదెలు 73,554 ఉన్నాయి. సగటున రోజుకి జిల్లాలో  3.40 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.  వైఎస్సార్‌ చేయూత పథకం కింద ప్రభుత్వం అందజేసిన 2,245 ఆవులు, గేదెల యూనిట్ల నుంచి రోజుకు 18 వేల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతున్నాయి.

మహిళలు ఆర్థికంగా ఎదిగేలా..
మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ‘చేయూత’ను అందిస్తోంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తోంది. పాడి పశువులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు తీసుకున్న మహిళలు వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఆర్థికంగా ఎదగాలి.  
- వై.వి.రమణ, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధకశాఖ
 
జగన్‌బాబు మేలు మరచిపోలేం
జగన్‌బాబు మాలాంటి పేదోళ్ల మనుగడకు ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారు. ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వైఎస్సార్‌ చేయూత కింద ఇచ్చిన ఆవును బాగా పోషిస్తున్నాను. పాలు విక్రయించగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నా.  
- రెడ్డి కొండమ్మ, వసాది గ్రామం, గంట్యాడ మండలం

ప్రస్తుతం జిల్లాలో ఉన్న పశువుల వివరాలు
జిల్లాలో 6,26,847 పశువులు ఉన్నాయి. ఇందులో 4,90,998 ఆవులు, 1,35,858 గేదెలు, 5,40,336 గొర్రెలు, 2,71,205 మేకలు, 54,92,310 కోళ్లు ఉన్నాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు