పేదరికాన్ని నిర్మూలించే సామర్థ్యం ఎనర్జీ రంగానికి ఉంది 

8 Sep, 2022 04:59 IST|Sakshi

గ్రీన్‌ కాలర్‌ అగ్రిటెక్‌ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకురాలు హేమలత అన్నామలై 

విశాఖలో ఘనంగా ఐఐపీఈ రెండో స్నాతకోత్సవం 

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ప్రపంచవ్యాప్తంగా విద్యుత్, వంటకు సరైన ఇంధనం లేక అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని గ్రీన్‌ కాలర్‌ అగ్రిటెక్‌ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకురాలు హేమలత అన్నామలై అన్నారు. వారి పేదరికాన్ని నిర్మూలించే సామర్థ్యం ఎనర్జీ రంగానికి ఉందని చెప్పారు. బుధవారం విశాఖపట్నంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన హేమలత అన్నామలై మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎనర్జీ రంగం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఐఐపీఈ అందించిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇంధన రంగానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తుతో దేశ భవిష్యత్‌ ముడిపడి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడుగురిలో ఒకరికి విద్యుత్‌ అందుబాటులో లేదన్నారు.

ఇంకా మూడు బిలియన్ల ప్రజలు కిరోసిన్, కలప, బొగ్గు ఆధారంగానే వంటలు చేస్తున్నారని చెప్పారు. ఐఐపీఈ విద్యార్థులు నూతన ఆవిష్కరణలను చేసి ఎనర్జీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా 87 మందికి డిగ్రీ పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐఐపీఈ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ పీకే బానిక్, ఐఐపీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శాలివాహన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు