ఇక జిల్లా ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్‌కు వైద్యం

10 Mar, 2022 06:13 IST|Sakshi

సేవల విస్తరణకు జాతీయ హెల్త్‌మిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 

గడిచిన ఏడాదిలో 5,334 మంది హెపటైటిస్‌ బాధితులకు చికిత్స 

‘స్క్రీనింగ్‌’లో ఏపీ రికార్డు 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో వైరల్‌ హెపటైటిస్‌ కేసులు క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ హెల్త్‌మిషన్‌ కేంద్ర అదనపు కార్యదర్శి, కేంద్ర ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్‌ వికాస్‌ షీల్‌ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులు, 2 జిల్లా ఆస్పత్రుల్లో హెపటైటిస్‌ బీ వైరస్‌కు సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్‌తో పాటు వైద్యం అందిస్తున్నారు. ఇక నుంచి అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్‌కు వైద్యం అందించాలని నిర్ణయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో 13 ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్‌ బాధితులకు వైద్యం అందనుంది.

అంటే మొత్తం 26 ఆస్పత్రుల్లో హెపటైటిస్‌ బీ, సి వ్యాధులకు పరీక్షలతో పాటు వైద్యం చేస్తారు. హెపటైటిస్‌ బీ లేదా సీ అనుమానిత కేసులైనా సరే ఇక్కడ వైద్యం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్ధారిత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ఎన్‌వీహెచ్‌సీపీ (నేషనల్‌ వైరల్‌ హెపటైటిస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం) పోర్టల్‌కు అనుసంధానం చేయాలి. ప్రతి ఆస్పత్రిలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హెపటైటిస్‌ వైరస్‌ వ్యాధులపై దేశంలోనే ఎక్కువ మందికి స్క్రీనింగ్‌ చేసి ఏపీ రికార్డు సృష్టించింది. 

ప్రత్యేక వైద్యుడి నియామకం 
జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో హెపటైటిస్‌ బాధితులకు వైద్యం అందించడానికి ప్రత్యేక డాక్టర్‌ను ఏర్పాటు చేస్తారు. జనరల్‌ మెడిసిన్‌ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజీ లేదా హెపటాలజీ వైద్యుల్లో ఒకరిని నియమిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గడిచిన ఒక్క ఏడాదిలోనే 5,334 మంది హెపటైటిస్‌ బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందగా.. 71 మంది మృతి చెందినట్లు నిర్ధారణ అయింది.  

మరిన్ని వార్తలు