మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్‌ అలర్ట్‌

28 Jul, 2022 16:21 IST|Sakshi
ముంచంగిపుట్టులో తనిఖీలకు వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు

అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచన 

సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు:  ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అలియాస్‌ గణేష్‌ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్‌ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్‌ చేపడుతున్నాయి. 


చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా  పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి.  మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్‌ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. 

జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్‌ఎఫ్‌ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు.

ఈ సందర్భంగా యాక్షన్‌టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్‌ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్‌: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి)

మరిన్ని వార్తలు