ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే: హైకోర్టు ఆగ్రహం

22 Nov, 2022 19:59 IST|Sakshi

అమరావతి:  ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చినా  తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వాస్తవాలు తొక్కిపెట్టి స్టే ఉత్తర్వులు పొందినందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్లకు చురకలు అంటించింది. 

కాగా, ఇప్పటం రోడ్డు విస్తరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు(మంగళవారం) హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలకు తొలగింపులకు సంబంధించి అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చారని కోర్టు ముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాస్తవాలు తొక్కిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదిపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు.

మరిన్ని వార్తలు