అనుమతుల్లేకపోతే వాటి కూల్చివేతకు ఆదేశాలిస్తాం: ఏపీ హైకోర్టు

6 Sep, 2022 07:14 IST|Sakshi

రుషికొండ రిసార్ట్‌ పునరుద్ధరణ పనులపై హైకోర్టు ధర్మాసనం 

సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండ రిసార్ట్‌ పునరుద్ధరణలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే వాటి కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నంబర్‌ 19 కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులివ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గతంలో ఇచ్చిన అనుమతులకు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలను సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.

మూర్తి యాదవ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ, అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యాలపై త్వరగా విచారణ చేపట్టాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. గతంలో తామిచ్చిన ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించినా ఆ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. 

చదవండి: (‘నవయుగ’ అప్పీల్‌లో కీలక పరిణామం)

మరిన్ని వార్తలు