‘పిల్‌’లు దుర్వినియోగం

7 Sep, 2022 04:09 IST|Sakshi

వాటి వెనుక రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు 

డబ్బులిచ్చి దాఖలు.. మధ్యవర్తులూ ఉంటున్నారు

కఠినంగా ఉంటాం.. భారీగా ఖర్చులు విధిస్తాం

స్పష్టం చేసిన హైకోర్టు సీజే ధర్మాసనం  

సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్‌) పేరుతో కొందరు కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హైకోర్టు హెచ్చరించింది. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కొందరి వెనుక ఉంటూ డబ్బులిచ్చి హైకోర్టులో వీటిని దాఖలు చేయిస్తున్నారని పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో జరుగుతోందని, ఇలాంటి వ్యాజ్యాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉందని తేల్చి చెప్పింది. హైకోర్టులో కొందరి తరఫున పిల్‌లు దాఖలు చేయించేందుకు మధ్యవర్తులు కూడా ఉన్నారని తెలిపింది.

తప్పుడు పిల్‌లు దాఖలు చేసే వారికి భారీగా ఖర్చులు విధించి తద్వారా గట్టి సందేశం పంపాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యంలో సింగిల్‌ జడ్జి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోడంతో అదే అంశంపై తిరిగి ధర్మాసనం ఎదుట పిల్‌ దాఖలు చేసిన వ్యక్తులకు ఖర్చులను కచ్చితంగా విధిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకు ఇది అన్ని రకాలుగా అర్హమైన కేసు అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ నేపథ్యం..
తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి పరిధిలో బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ఏర్పాటును సవాలు చేస్తూ జి.సుధాకర్‌రెడ్డి మరో ఇద్దరు పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గత విచారణ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇదే అంశంపై సింగిల్‌ జడ్జి ఎదుట ఓ వ్యక్తి పిటిషన్‌ వేశారని, అందులో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. ఆ విషయం తెలిసి కూడా పిటిషనర్లు పిల్‌ దాఖలు చేయడం కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. 

అత్యధిక శాతం దుర్వినియోగం చేసేవే..
తాజాగా ఈ పిల్‌ విచారణకు రావడంతో ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్లకు ఎంత మేర ఖర్చులు విధించాలో చెప్పాలని పేర్కొంది. ఈ రోజుల్లో నిజమైన పిల్‌లు చాలా స్వల్ప సంఖ్యలో దాఖలవుతున్నాయని, అత్యధిక శాతం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసేవేనని తెలిపింది. 

ఎవరో వేస్తారు.. ఎవరికో డబ్బు అందుతుంది
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు నిరక్ష్యరాస్యులని నివేదించారు. కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి ఎంత మాత్రం లేదన్నారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇవ్వలేదన్న విషయం వారికి తెలియదన్నారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ పిల్‌లు దాఖలు చేసే వారికి భారీ మొత్తంలో ఖర్చులను విధించాల్సిందేనని, అయితే పిటిషనర్లు ఆ కోవలోకి రారని విన్నవించారు.

అయితే నిరర్థక వ్యాజ్యాలపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి వ్యాజ్యాల కోసం తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని, ఇన్ని రోజులకు అలాంటి వ్యాజ్యం ఎదురైందని, రూ.25 లక్షలను ఖర్చుల కింద విధించాలన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చామని, ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను సైతం సిద్ధం చేశామని తెలిపింది. ఎవరో పిల్‌ వేస్తారని, ఎవరికో డబ్బులు చెల్లిస్తారని, ఇలాంటి వ్యాజ్యాలను విచారించడం తమ పని కాదని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యంలో ఖచ్చితంగా ఖర్చులు విధిస్తామని, అయితే అది ఎంతనేది తరువాత నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. 

మరిన్ని వార్తలు