నేనొచ్చాక రోస్టర్‌ ఎన్నిసార్లు మారింది?

2 Nov, 2020 02:49 IST|Sakshi

సీఎం జగన్‌ ఫిర్యాదు నేపథ్యంలో వివరాలను వెలికితీయించిన హైకోర్టు సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి

పూర్తి వివరాలు తన ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశం

తేదీలు, జడ్జిల పేర్లతో వివరాలు సమర్పించిన అధికారులు

గతంలో ఏ సీజే మార్చనన్నిసార్లు రోస్టర్‌ మార్చిన చీఫ్‌ జస్టిస్‌ మహేశ్వరి

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో జడ్జిల రోస్టర్‌ను సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి హైకోర్టులో కేసుల విచారణ రోస్టర్‌(ఎవరెవరు ఏయే కేసులు విచారించాలి. ఏయే సబ్జెక్టులు విచారించాలో తెలియజేసేది. దీనిని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారు) వివరాలను వెలికి తీయించారు. సీఎం ఫిర్యాదుపై సుప్రీంకోర్టు స్పందించే పరిస్థితి కనిపిస్తుండటంతో, తన హయాంలో జరిగిన రోస్టర్‌ మార్పుల వివరాలను బయటకు తీయించినట్లు తెలుస్తోంది. తాను ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన 2019 అక్టోబర్‌ 7 నుంచి ఇప్పటివరకు రోస్టర్ల వివరాలను తన ముందుంచాలని ఆదేశించారు. ఎన్నిసార్లు రోస్టర్లు మారాయి? ఏయే రోస్టర్‌లో ఏ ఏ న్యాయమూర్తులున్నారు? వాళ్లు ఏయే కేసులు విచారించారు? వారి సబ్జెక్టులు ఏమిటి? తదితర వివరాలు అడిగినట్లు తెలిసింది. హైకోర్టు అధికారులు వివరాలను సీజే ముందుంచినట్లు విశ్వసనీయ సమాచారం. తేదీ, సబ్జెక్ట్, జడ్జిల పేర్లు తదితర వివరాలతో జాబితా అందజేసినట్లు తెలిసింది.

గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో..
గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో, ఏ ప్రధాన న్యాయమూర్తి మార్చనన్నిసార్లు జస్టిస్‌ మహేశ్వరి రోస్టర్‌ను మారుస్తూ వచ్చారు. ఇందుకు కోవిడ్‌ పరిస్థితులు కూడా కారణమయ్యాయి. కోవిడ్‌ వల్ల వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే విచారణ జరుగుతుండటం, తక్కువమంది జడ్జిలతో విచారణలు చేపట్టాలి్సన పరిస్థితులు ఉండటంతో తరచూ రోస్టర్‌ను మార్చారు. అయితే ఓ నలుగురు న్యాయమూర్తులు మాత్రం ఎక్కువసార్లు కేసులను విచారిస్తూ వచ్చారు. ముఖ్యమైన సబ్జెక్టులు, కేసులు ఈ నలుగురి చుట్టూనే తిరుగుతూ వచ్చాయి. ఒక దశలో రోస్టర్‌లో ఎవరున్నా లేకున్నా ఈ నలుగురు మాత్రం ఎక్కువ రోజులు కొనసాగుతూ వచ్చారు.   

మళ్లీ మారిన రోస్టర్‌..
సీజే మహేశ్వరి తాజాగా మరోసారి రోస్టర్‌ను మార్చారు. ఇందులో భాగంగా రాజధాని కేసులను విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలు మొన్నటి వరకు త్రిసభ్య ధర్మాసనంగా కేసులను విచారించారు. ఇప్పుడు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ స్థానంలో జస్టిస్‌ నైనాల జయసూర్య వచ్చారు. రాజధాని కేసుల్లో సోమవారం నుంచి జరగబోయే తదుపరి విచారణను ఈ త్రిసభ్య ధర్మాసనమే కొనసాగిస్తుంది. కాగా  ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అన్ని బెయిల్‌ పిటిషన్ల విచారణ బాధ్యతను జస్టిస్‌ కన్నెగంటి లలితకు అప్పగించారు. రెవెన్యూ, భూ సేకరణ కేసులను జస్టిస్‌ డి.రమేశ్‌కు కేటాయించారు. 

‘విశాఖ అతిథి గృహం’పై నేడు ఉత్తర్వులు
కాగా, విశాఖలో రాజధాని తరలింపులో భాగం గానే ప్రభుత్వం అతిథిగృహం నిర్మిస్తోందని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై జస్టిస్‌ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు  వెలువరించనుంది.  

మరిన్ని వార్తలు