మహిళకు ఇంటి స్థలం ఇస్తే కుటుంబం లబ్ధి పొందినట్లే

25 Nov, 2021 05:01 IST|Sakshi

ప్రభుత్వ పథకాల్లో వంద శాతం సంతృప్తి సాధ్యం కాదు

సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రభావం ఇళ్ల స్థలాలు పొందిన వారందరిపై ఉంది

మహిళల వాదనలు విని ఉంటే సహజ న్యాయసూత్రాలను పాటించినట్లుండేది

పేదలందరికీ ఇళ్ల స్థలాలపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు

విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: మహిళకు ఇంటి స్థలం ఇస్తే కుటుంబం అంతా లబ్ధి పొందినట్లేనని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో 100 శాతం సంతృప్తి సాధ్యం కాదని తెలిపింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రభావం ఆ స్థలాలు పొందిన వారందరిపై పడుతుందని స్పష్టంచేసింది.తీర్పునిచ్చే ముందు వారందరికీ సింగిల్‌ జడ్జి నోటీసులు జారీ చేసి వారి వాదనలు కూడా విని ఉంటే సమంజసంగా ఉండేదని అభిప్రాయపడింది.

మహిళల వాదనలు విని ఉంటే సహజ న్యాయ సూత్రాలను అనుసరించినట్లు ఉండేదని వ్యాఖ్యానించింది. వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌ శ్రీరామ్‌ పలు విషయాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాలతో అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికే వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దంటూ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి గత నెలలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి వద్ద 128 మంది కలిసి ఓ పిటిషన్‌ వేశారని, వారిలో 51 మంది మహిళలే ఉన్నారని ఏజీ తెలిపారు.

మహిళలకు పట్టాలివ్వడాన్ని మహిళలే సవాలు చేయడం సందేహాస్పదంగా ఉందన్నారు. కుటుంబంలో మహిళలు లేకుంటే పురుషులకు పట్టాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ఇది తమ హామీ అని ఏజీ చెప్పారు. మహిళలు దరఖాస్తు చేయని కుటుంబాల్లో 77వేల మంది పురుషులకు పట్టాలు ఇచ్చామన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన మార్గదర్శకాలకు లోబడే మహిళలకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూ సేకరణ కోసం రూ.10 వేల కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ.1,800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు లేవనెత్తని ఎన్నో విషయాలను సింగిల్‌ జడ్జి తన తీర్పులో ప్రస్తావించారన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన వారి వాదనలు వినకుండానే ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. పేదలకు బంగ్లా కట్టించాలన్నది ప్రభుత్వ కల అని, అయితే ఆ కల ఆచరణ సాధ్యం కాదని వివరించారు. మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎక్కడా ఎలాంటి వివక్ష గానీ, నిబంధనల ఉల్లంఘన గానీ జరగలేదని చెప్పారు.  
24వీఐడబ్ల్యూ40: పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపడుతున్న సిబ్బంది  

మరిన్ని వార్తలు